'థాంక్యూ' టికెట్ రేట్లపై నేను చెప్పింది.. చెప్పాలనుకున్నది తప్పుగా వెళ్ళింది

Update: 2022-07-20 11:37 GMT
టాలీవుడ్ లో టికెట్ రేట్లు అనేవి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా పాండమిక్ తర్వాత టికెట్ ధరలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అధిక రేట్ల కారణంగా రోజురోజుకూ జనాలు థియేటర్లకు దూరం అవుతున్నారు. ఇటీవల తెలుగులో రిలీజైన కొన్ని చిత్రాలు దానిని స్పష్టంగా నిరూపించాయి.

ఈ నేపథ్యంలో టికెట్ ధరల విషయంలో మేకర్స్ దిగి వస్తున్నారు. అందుబాటులో ఉండే ధరలనే ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 'మేజర్' 'విక్రమ్' లాంటి సినిమాలు తక్కువ రేట్లతోనే మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు 'థాంక్యూ' సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి టికెట్ ధరల అంశం చర్చకు వచ్చింది.

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'థ్యాంక్యూ' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా సరసమైన ధరలకే లభిస్తుందని.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచబోమని ప్రకటించారు.

'థాంక్యూ' సినిమా కోసం జీఎస్టీ మినహాయించి మల్టీఫ్లెక్స్ లలో రూ. 150 మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 టికెట్ ధరలుగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు సాధారణంగానే ఉన్నాయి కానీ.. నైజాం ఏరియాలో మాత్రం టిక్కెట్ ధరలు అధికంగానే ఉన్నాయి.

హైదరాబాద్ లో కొన్ని మల్టీప్లెక్స్లలో రూ. 200 ఉంటే మరికొన్నిట్లో రూ. 250 వరకూ టికెట్ రేట్లు ఉన్నాయి. రిక్లైనర్లు అయితే రూ. 300 - 350 గా ఉంది. సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్ లో రూ. 150 - రూ. 175.. లోయర్ క్లాస్ లో రూ.100 - రూ.110 గా ధరలు ఉన్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.

అయితే ఈ రేట్లు ఇవి ఇటీవల వచ్చిన పెద్ద సినిమాల కంటే తక్కువ అయినప్పటికీ.. సాదారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే సరసమైన ధరలైతే కాదు. 'ఎఫ్ 3' సినిమాకి కూడా రేట్లు తగ్గించామని చెప్పినప్పటికీ అవి ఆడియన్స్ కు భారంగానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు 'థాంక్యూ' సినిమా విషయంలో దిల్ రాజు ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

'థాంక్యూ' రిలీజ్ కు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో టికెట్ రేట్ల గురించి చెప్పాను. నేను చెప్పింది.. చెప్పాలనుకున్నది మిస్ కాలిక్యులేషన్ అయింది. కొందరు మీడియా మిత్రులు నేను చెప్పిన రేట్ల విషయంలో తప్పు ఉందని రాస్తున్నారని తెలిసింది. దీనిపై మరోసారి క్లుప్తంగా చెప్తాను''

''F 3 సినిమాకి చాలా వరకు రేట్లు తగ్గించాం. గవర్నమెంట్ జీవోతో వెళ్ళాం. ఆ తర్వాత వచ్చిన 'మేజర్' 'విక్రమ్' సినిమాలకు 'ఎఫ్ 3' కంటే తక్కువ ధరలు పెట్టారు. ఇప్పుడు 'థాంక్యూ' సినిమాకి విక్రమ్ - మేజర్ కి ఉన్న రేట్లే ఉన్నాయి. నేను చెప్పిన లెక్కల్లో మిస్టేక్ ఉందేమో. హైదరాబాద్ - వైజాగ్ లాంటి నగరాల్లో ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ లో రూ.150 ఉంది.. మల్టీఫ్లెక్స్ లలో రూ.200 ఉంటుంది. స్టార్ హీరోలు - భారీ బడ్జెట్ సినిమాలను పక్కన పెడితే ఇకపై దాదాపు అన్ని చిత్రాలకు ఇవే రేట్లు ఫిక్స్ అవుతాయి'' అని తెలిపారు.

''ఏపీలో జీవో ప్రకారం ఫిక్సెడ్ టికెట్ రేట్లు ఉన్నాయి. తెలంగాణలోనే ధరలు మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒకే విధమైన రేట్లు ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నాం. దాని ప్రకారం ఫిక్స్ చేసిన ధరలు ప్రకటిస్తాం. ఇప్పుడు టికెట్ రేట్లను పాండమిక్ ముందూ తర్వాత అని చూడాలి. పాండమిక్ కి ముందు అయితే ఈ రేట్ల గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సి వస్తోంది. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి''

''ఇంతకుముందు హైదరాబాద్ లో అన్ని థియేటర్లలో 200 ఉండేది.. ఇప్పుడు 150 ఉంది. ఆడియన్స్ థియేటర్ కు వచ్చి ఖర్చు చేసే కెపాసిటీని పరిగణలోకి తీసుకుని చూడాలి'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే బుక్ మై షో పోర్టల్ ఓపెన్ చేసి చూస్తే.. నైజాంలో పలు థియేటర్లలో నిర్మాత చెప్పిన రేట్లు లేకపోవడం గమనార్హం.
Tags:    

Similar News