'క్రాక్' సినిమాతో ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు గోపీచచంద్ మలినేని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ తర్వాత యాభై శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో కూడా రికార్డులను బద్దలు కొట్టింది. 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది.
ఠాగూర్ మధు ఆర్థిక వ్యవహారాల కారణంగా 'క్రాక్' విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి డైరెక్టర్ గోపీచంద్ మలినేని 'క్రాక్' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వలేదని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన బ్యాలన్స్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్ దీనిపై విచారణ చేపడుతోంది.