తెలుగు బిగ్‌బాస్... మళ్లీ అవే పుకార్లు!
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ సమయంలోనూ హోస్ట్ గురించిన పుకార్లు షికారు చేయడం కొత్తేం కాదు.;
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ సమయంలోనూ హోస్ట్ గురించిన పుకార్లు షికారు చేయడం కొత్తేం కాదు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్ సూపర్ హిట్ అయినా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ కొనసాగలేక పోయారు. ఆయన స్థానంలో ఎవరు వస్తారు అనే విషయంలో చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఎంతో మంది పేర్లు వినిపించాయి. చివరకు యంగ్ హీరో నాని చేతిలో బిగ్‌బాస్ సీజన్ 2 బాధ్యతలు చేపట్టాడు. నాని కనీసం మూడు నాలుగు సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తాడని అంతా భావించారు. కానీ వచ్చిన నెగిటివిటీతో ఒక్క సీజన్‌కే గుడ్ బై చెప్పాడు.
సీజన్ 2 హోస్టింగ్ చేసిన నానిపై విమర్శలు వచ్చినా రేటింగ్ బాగానే వచ్చింది. దాంతో సీజన్ 3 హోస్ట్ విషయంలో మళ్లీ చర్చలు మొదలు అయ్యాయి. పుకార్లు షికార్లు చేశాయి. చివరకు నాగార్జునను బిగ్‌బాస్ టీం సీజన్ 3 కోసం తీసుకు వచ్చారు. నాగార్జున వరుసగా రెండు సీజన్‌లు చేసిన తర్వాత ఆయన స్థానంలో కొత్త హోస్ట్ రాబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. బాలకృష్ణ, చిరంజీవి, రానా, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఇలా ఎంతో మంది పేర్లు ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో వినిపిస్తూ వస్తున్నాయి. సీజన్ 3 నుంచి మొదలుకుని మొన్న పూర్తి అయిన సీజన్ 8 వరకు మధ్యలో ఒక ఓటీటీ సీజన్‌కు సైతం నాగార్జున హోస్టింగ్ చేశారు.
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. అయితే హోస్ట్ మార్పు గురించి మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత సీజన్‌కి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి, చెత్తగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దాంతో పాటు నాగార్జున హోస్టింగ్ బోర్ కొట్టిందంటూ కామెంట్స్ వచ్చాయి. అందుకే బిగ్‌బాస్ షో నిర్వాహకులు సీజన్ 9కి కొత్త హోస్ట్‌ను కన్ఫర్మ్ చేశారంటూ పుకార్లు కొత్తగా పుట్టుకు వచ్చాయి. విజయ్ దేవరకొండతో చర్చలు జరిపి సీజన్ 9 బాధ్యతలను ఆయనకు అప్పగించాలని నిర్ణయించారు అంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి.
నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల్లోనూ బిజీగా లేరు. ఆయన సోలో హీరోగా సినిమాను చేసి చాలా రోజులు అయింది. త్వరలోనే ధనుష్‌తో కలిసి నటించిన కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు ఏమీ లేవు. అయినా బిగ్‌బాస్ సీజన్ 9కి నాగ్ నో చెప్పి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాదిరిగా బిగ్ బాస్ హోస్ట్ మారడం అనేది కేవలం పుకారు అయ్యి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. కొందరు మాత్రం ఈసారి బలంగానే హోస్ట్ మారే అవకాశాలు ఉన్నట్లున్నాయి అంటూ వాదిస్తున్నారు. మరో మూడు నెలల్లో సీజన్ ప్రారంభం కానుంది. ఈలోపు హోస్ట్ విషయంలో నిర్వాహకులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.