లీగ‌ల్ చిక్కుల్లో రామ్ డైరెక్ట‌ర్‌?

Update: 2022-08-22 13:34 GMT
ఉస్తాద్ రామ్ హీరోగా తెర‌కెక్కిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ `ది వారియ‌ర్‌`. శ్రీ‌నివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. చాలా కాలంగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శ‌కుడు లింగుస్వామికి `ది వారియ‌ర్‌` అయినా గ‌ట్టెక్కిస్తుంద‌ని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ ఆయ‌న‌కు భారీ షాక్ ఇచ్చింది. ఇదిలా వుంటే ద‌ర్శ‌కుడు లింగు స్వామి లీగ‌ల్ చిక్కుల్లో ఇరుక్కున్న‌ట్టుగా తెలుస్తోంది.

చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సయిదా పేట కోర్టు ఎన్‌. లింగు స్వామికి ఆరు నెల‌ల జైలు శిక్ష విశించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. లింగుస్వామితో పాటు చెక్ బౌన్స్ కేసులో ఆయ‌న సోద‌రుడు సుభాష్ చంద్ర‌కు కూడా 6 నెల‌ల జైలు శిక్ష విధించిన‌ట్టుగా తెలుస్తోంది. 1.03 కోట్ల విలువైన చెక్ బౌన్స్ కావ‌డంతో ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి, అత‌ని సోద‌రుడు సుభాష్ చంద్ర‌పై కోర్టులో కేసు ఫైల్ అయింది.  

కొన్నేళ్ల క్రితం పీవీపీ క్యాపిట‌ల్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ నుంచి లింగు స్వామి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌పై పీవీపీ క్యాపిట‌ల్ సంస్థ కోర్టులో కేసు వేసింద‌ట‌. ఈ నేప‌థ్యంలో లింగు స్వామి ఓ చెక్కుని స‌ద‌రు సంస్థ‌కు అంద‌జేశాడ‌ట‌. అది బౌన్స్ కావ‌డంతో పీవీపీ క్యాపిట‌ల్ సంస్థ కోర్టుని ఆశ్ర‌యించింది. కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో లింగుస్వామి సోద‌రులు హై కోర్టులో తీర్పుపై అప్పీలుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన `ఆనందం` సినిమాతో ఎన్‌. లింగుస్వామి కెరీర్ మొద‌లైంది. తొలి సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత ఇదే సినిమాని తెలుగులో వెంక‌టేష్‌, శ్రీ‌కాంత్ ల‌తో `సంక్రాంతి` పేరుతో రీమేక్ చేశారు. మాధ‌వ‌న్‌, మీరా జాస్మిన్ ల `ర‌న్‌`, విశాల్ `పందెంకోడి` సినిమాల‌తో లింగుస్వామి ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ద‌ర్శ‌కుడిగా రాణిస్తూనే త‌న సోద‌రుడు సుభాష్ చంద్ర‌తో క‌లిసి `తిరుప‌తి బ్ర‌ద‌ర్స్` పేరుతో నిర్మాణ సంస్థ‌ని కూడా ప్రారంభించి సినిమాలు నిర్మించారు. 2012లో మాధ‌వ‌న్‌, ఆర్య‌ల‌తో రూపొందించిన `వేట్టై`తో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న లింగుస్వామి అప్ప‌టి నుంచి స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. రామ్ తో చేసిన `ది వారియ‌ర్‌`తో అయినా మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని చేసిన ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.
Tags:    

Similar News