నయన్ వద్దంటే తమన్నాకు ఆ సూపర్ హిట్..!
పైయా సినిమాను మొదలు పెట్టిన సమయంలో కార్తీకి జోడీగా తమన్నా కాకుండా నయనతార ను హీరోయిన్‌గా అనుకున్నట్లు చిత్ర దర్శకుడు లింగుస్వామి చెప్పుకొచ్చాడు.;
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో కోలీవుడ్‌లోనూ అదే స్థాయిలో స్టార్‌డం దక్కించుకుంది. తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు దక్కితే కోలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడికి 'పైయా' సినిమాతో గుర్తింపు దక్కింది. పైయా సినిమాను తెలుగులో ఆవారా గా డబ్ చేసి విడుదల చేశారు. కార్తీ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన పైయా తమిళ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పైయా సినిమా తెలుగులో భారీ ఎత్తున వసూళ్లు రాబట్టింది. పైయా సినిమాను మొదలు పెట్టిన సమయంలో కార్తీకి జోడీగా తమన్నా కాకుండా నయనతార ను హీరోయిన్‌గా అనుకున్నట్లు చిత్ర దర్శకుడు లింగుస్వామి చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లింగు స్వామి మాట్లాడుతూ పైయా రోజులను గుర్తు చేసుకున్నాడు. పైయా కథకు నయనతార ఓకే చెప్పింది. ఆమె డేట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధం అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమాలో నటించేందుకు నో చెప్పింది. ఆమె నో చెప్పడంతో ప్రాజెక్ట్ గురించి కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తాను నమ్మకంతో తమన్నాను తీసుకు వచ్చాను. పైయా సినిమా షూటింగ్ సమయంలో తమన్నా వయసు కేవలం 19 ఏళ్లు. ఆ సమయంలో తమన్నా ఈ సినిమా కోసం పడ్డ కష్టం చూసి తాను షాక్ అయ్యాను అని లింగు స్వామి చెప్పుకొచ్చాడు. ట్రావెల్ సినిమా కావడంతో కార్‌వాన్ ఇబ్బంది ఉండేది. కార్ వాన్ లేని సమయంలో కారులోనే డ్రెస్ మార్చుకునేది.
తమన్నా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరితో చక్కగా ఉండేది. కార్తీతో ఆమె నటించిన సన్నివేశాలు కొన్ని ఎక్కువ ఎండలో లేదా దుమ్ము ఉన్న ప్రాంతంలో తీసినా కూడా ఆమె ఇబ్బంది పడకుండా సహకరించింది. అప్పుడే తమన్నా ప్రతిభావంతురాలని, ఇండస్ట్రీలో టాప్ స్థాయికి వెళ్తుందని నేను భావించాను అన్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ టాప్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ సినిమాల్లో నటించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
నయనతార ఆ రోజు పైయా సినిమాలో నటించేందుకు నో చెప్పడం వల్లే నేడు తమన్నా కు ఈ స్థాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కార్తీతో కలిసి నటించిన పైయా సినిమాతో తెలుగులోనూ తమన్నాకు మరింతగా ఆఫర్లు వచ్చాయని కొందరు అంటారు. ఏది ఏమైనా నయనతార వద్దు అనుకున్న పైయా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలో నటించిన తమన్నా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ సినిమాను వదిలేసినంత మాత్రాన నయనతారకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆమె కూడా కెరీర్‌లో టాప్ స్టార్‌గా ఎదిగింది. అంతే కాకుండా లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్‌ను సైతం సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.