నందినీ రెడ్డికి అశ్వనీదత్ ఎందుకు సారీ చెప్పారు?

Update: 2022-05-09 23:30 GMT
సినిమా పరిశ్రమలో ఉన్నన్ని ఇగోలు మరెక్కడా ఉండవని చెబుతారు. మరే రంగంలో లేనంత ప్రోటోకాల్ సినిమా రంగంలో ఉంటుంది. అదే సమయంలో సక్సెస్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎంత తోపు సీనియర్ అయినా సరే రెండు ఫట్లు పడితే ఒక్కసారిగా ఆకాశం మీద నుంచి నేలకు దించేస్తారు. ఎంత చిన్న హీరో అయినా సరైన హిట్లు రెండు పడితే.. మొత్తం ఇండస్డ్రీ మొత్తం చుట్టూ తిరిగేసే విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో తమ అంచనాలు తప్పు అయితే.. వాటిని ఒప్పుకునే విషయంలో విపరీతమైన ఆటిట్యూడ్ ప్రదర్శిస్తుంటారు.

సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఎంతోమందికి ఇలాంటి అనుభవాలెన్నో. కానీ.. కొందరు మాత్రం వీటికి భిన్నంగా ఉంటారు. తమ అంచనాలు తప్పు అయితే.. ఆ తర్వాత తాము తప్పు చెప్పామని చెప్పటమే కాదు.. సారీ చెప్పేందుకు సైతం వెనుకాడని గొప్ప గుణం కొందరిలో ఉంటుంది.

సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఆ కోవకు చెందిన వారు. అగ్రహీరోలతో బోలెడన్ని సినిమాలు చేసిన ఆయన.. ఒక మహిళా దర్శకురాలికి సారీ చెప్పిన ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. ఆ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు నందినీ రెడ్డి.

ఆమె దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా అలా మొదలైంది సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చిన ఈ మూవీకి నిర్మాతగా దాము వ్యవహరించారు. వాస్తవానికి ఈ సినిమాను ముందు స్వప్నాదత్ కు చెప్పటం.. ఆమె బాగుందని.. తన తండ్రి అశ్వినీదత్ కు చెప్పాలని చెప్పారు. ఆయనకుకథ చెప్పినప్పుడు.. అందులో కొన్ని మార్పులు చెప్పారు.

అయితే.. ఆ మార్పులు నందినీ రెడ్డికి ఇష్టం లేదు. ఇదే విషయం స్వప్నకు చెబితే.. ఆమె పాజిటివ్ గా రియాక్టు అయ్యారు. ఆ సినిమాను తీసేందుకు నిర్మాత దాము సిద్ధంగా ఉన్నారని చెప్పినప్పుడు.. కథలో మార్పులు చేయకుండా నిర్మాత దాము ఓకే చెస్తే ఆయనకే చేయ్ అన్నారని.. సినిమా విడుదలయ్యాక నాన్న సారీ చెబుతారు అని ఆమె చెప్పినట్లు వెల్లడించారు.

అనుకున్నట్లే సినిమా విడుదల కావటం.. సూపర్ హిట్ కావటం జరిగింది. స్వప్నదత్ చెప్పినట్లే.. అశ్వినీదత్ తనకు సారీ చెప్పారన్నారు. ఆ విషయంలో అశ్వినీదత్ గ్రేట్ అని పొగిడేశారు నందినీ రెడ్డి. ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే’ అన్న మూవీని హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తీస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ నందినీకి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News