వెండితెర కామ్రేడ్స్ .. వాళ్లెవ‌రు.. ఏమాక‌థ‌?

Update: 2022-04-15 00:30 GMT
వెండితెర పై ఒక ద‌శ‌లో సీమ ఫ్యాక్ష‌న్ చిత్రాలు ఓ ఊపు ఊపాయి. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాయి. ఆ త‌రువాత ల‌వ్ స్టోరీస్‌, రివేంజ్ డ్రామాస్, పోలీస్ స్టోరీస్ ట్రెండ్ సెట్ట‌ర్ లుగా నిలిచి మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా ప్ర‌తీ హీరో కెరీర్ లో ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్ హిట్ లుగా నిలిచిపోయాయి. ఇక అదే స్థాయిలో న‌క్స‌ల్స్ నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రాలు కూడా చ‌రిత్ర సృష్టించాయి. ఈ నేప‌థ్యంలో రూపొందిన చిత్రాల్లో చాలా మంది స్టార్ హీరోలు కామ్రేడ్స్ గా న‌టించి సంచ‌ల‌నాలు సృష్టించారు. ఆర్ . నారాయ‌ణ‌మూర్తి  నుంచి మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చ‌రణ్ వ‌ర‌కు కామ్రేడ్స్ గా న‌టించి ఆక‌ట్టుకుంటున్నారు.

1986లో ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `అర్థ్ర రాత్రి స్వాతంత్రం`. హీరో గోపీచంద్ తండ్రి టి. కృష్ణ న‌టించిన చివ‌రి చిత్ర‌మిది. ఇందులో ఆర్. నారాయ‌ణ‌మూర్తితో కామ్రేడ్ గా న‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ చిత్రం కోసం వంగ పండు ప్ర‌సాద‌రావు పాడిన `ఏం పిల్లో ఎల్దామొస్త‌వా.. పాట ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ సాంగ్ గా నిలిచింది. ఆ త‌రువాత ఇప్ప‌టికీ ఇదే పంథాలో సినిమాలు నిర్మిస్తూ వ‌స్తున్నారాయ‌న‌. ఆర్ . నారాయ‌ణ మూర్తి త‌రువాత ఈ పంథాలో సినిమా చేసిన హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ‌.

`కంచు కాగ‌డ‌` త‌రువాత ఎన్‌. శంక‌ర్ డైరెక్ష‌న్ లో సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన చిత్రం `ఎన్ కౌంట‌ర్‌`. ఇందులో ర‌మేష్ బాబు, రోజా కామ్రేడ్ లు గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఒక ద‌శ‌లో ఎర్ర చిత్రాల ట్రెండ్ న‌డిచింది. ఈ స‌మ‌యంలోనే క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా కామ్రేడ్ అవ‌తారం ఎత్తారు. ఆయ‌న బి. గోపాల్ డైరెక్ష‌న్ లో చేసిన చిత్రం `అడ‌విలో అన్న‌` ఈ చిత్రంలో రోజా కూడా కామ్రేడ్ గా న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. నారాయ‌ణ‌మూర్తి ఎర్ర చిత్రాలు ప్రారంభించిన స‌మ‌యంలో ఆయ‌న‌కు ధీటుగా అదే త‌ర‌హా చిత్రాల్లో కామ్రేడ్ గా న‌టించిన హీరో మాదాల రంగారావు. ఎర్ర మ‌ట్టి, ఎర్ర మల్లెలు, యువ‌త‌రం క‌దిలింది వంటి చిత్రాల్లో ఆయ‌న న‌క్స‌లైట్ పాత్ర‌ల్లో న‌టించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

అంత‌కు ముందు వ‌చ్చిన `మా భూమి`లోనూ సాయి చంద్ న‌క్స‌లైట్ గా మారి గ‌న్ను ప‌ట్టాడు. ఇక ఆ త‌రువాత స్టార్ ఇమేజ్ వున్న హీరోలు కామ్రేడ్ లుగా మెరిసిన చిత్రాలే చాలానే వున్నాయి. లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజ‌య‌శాంతి `ఒసేయ్ రాముల‌మ్మ‌` చిత్రంతో మాస్ ప్రేక్ష‌కుల్లో ఆరాధ్య దేవ‌త‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ త‌రువాత అడ‌వి చుక్క‌, స‌మ్మ‌క్క సార‌క్క వంటి చిత్రాల్లోనూ కామ్రేడ్ గా న‌టించింది. కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన `సిందూరం`లో బ్ర‌హ్మాజీ, ర‌వితేజ న‌క్స‌లైట్ లుగా మెరిసారు.

ఇక ఈ త‌రం హీరోల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `జ‌ల్సా` చిత్రంలో న‌క్స‌లైట్ గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌రువాత జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన యువ‌కుడిగా ఈ చిత్రంలో క‌నిపించాడు. ప్ర‌స్తుతం న‌క్స‌లైట్ ఉద్య‌మం నేప‌థ్యంలో రెండు క్రేజీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా వున్నాయి. అందులో ఒక‌టి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప‌రిస్థితుల కార‌ణంగా కామ్రేడ్ గా మారిన ర‌వ‌న్న పాత్ర‌లో రానా క‌నిపించ‌బోతున్నాడు.

ఇదే చిత్రంలో ప్రియ‌మ‌ణి కూడా న‌క్స‌లైట్ భార‌త‌క్క‌గా క‌నిపించ‌బోతోంది. ఇక ఇంత కాలానికి మెగాస్టార్ చిరంజీవి కూడా కామ్రేడ్ అవ‌తారం ఎత్తారు. ఆయ‌న‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ కూడా న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఆచార్య‌`. ఇటీవ‌లే ట్రైల‌ర్ విడుద‌ల చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇలా ఆర్‌. నారాయ‌ణ మూర్తి నుంచి రామ్ చ‌ర‌ణ్ వ‌ర‌కు మ‌న హీరోలు కామ్రేడ్ లుగా వెండితెర‌పై అల‌రించారు. త్వ‌ర‌లో రానున్న ఆచార్య‌, విరాట‌ప‌ర్వం చిత్రాలు ఏ స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తాయో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
Tags:    

Similar News