మార్చురీలో చూసి గుండె ముక్క‌లైంది - శంక‌ర్

Update: 2020-02-29 14:02 GMT
భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) సెట్స్ లో మృత్యుఘోష గురించి తెలిసిందే. ముగ్గురు మ‌ర‌ణించ‌గా ప‌ది మందికి గాయాలైన దుర్ఘ‌ట‌న సంచ‌ల‌న‌మైంది. మ‌ర‌ణించిన వారిలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్.. ఆర్ట్ డైరెక్ట‌ర్.. ప్రొడ‌క్ష‌న్ బోయ్ ఉన్నారు. ఆ కుటుంబాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఇక మ‌ర‌ణించిన వారికి క‌మ‌ల్ హాస‌న్ కోటి .. లైకా సంస్థ సుభాష్క‌ర‌ణ్ 2కోట్ల‌ ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు శంక‌ర్ ని పోలీసులు ప్ర‌శ్నించారు. త్వ‌ర‌లోనే క‌మ‌ల్ హాస‌న్ ని ప్ర‌శ్నించ‌నున్నారు.

అయితే ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పాట్ లో క‌మ‌ల్ హాస‌న్ క‌న్నీటిప‌ర్యంత‌మై ఘ‌ట‌న‌పై చ‌లించిపోయారు. అయితే అప్ప‌టికి ఇంకా షాక్ లోనే ఉండిపోయిన శంక‌ర్ ఆ దుర్ఘ‌ట‌న‌పై స్పందించ‌లేదు. తాజాగా ఆయ‌న మీడియా ముందు క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక‌పోతున్నాన‌ని ఆయ‌న అన్నారు. ఈ ఘోర దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారిలో.. నెల రోజుల ముందే తన వద్ద సహాయకుడిగా చేరిన కృష్ణ ఉండ‌డం క‌ల‌చి వేసింద‌ని అన్నారు. ఇంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కించే చిత్ర బృందంలో చేరిన కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుని చక్కగా పని చేసిన కుర్రాడు కృష్ణ .. త‌న‌ని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అని అన్నారు. అత‌డి కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన‌ప్పుడు త‌న త‌ల్లి ప‌డిన వేద‌న ఇంకా క‌ళ్ల‌లోనే మెదులుతోంద‌ని శంక‌ర్ క‌ల‌త చెందారు. ప్రొడక్షన్‌ బాయ్‌ మధును మార్చురీలో చూసి తన గుండె ముక్కలైందని.. ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో చంద్రన్‌ మరణం తనను తీవ్రంగా క‌ల‌చి వేసింద‌ని అన్నారు.

ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా అనూహ్యంగా ప్ర‌మాదం జ‌రిగింది. ఇది ఊహించ‌నిది అందుకే షాక్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక మ‌ద‌న‌ప‌డుతున్నాన‌ని శంక‌ర్ అన్నారు. శంక‌ర్ త‌న‌వంతుగా మృతి చెందిన వారి కుటుంబాల‌కు కోటి ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News