ఒక్క సెట్‌ కు రూ.40 కోట్లు ఏంటీ బాసూ?

Update: 2019-10-20 09:15 GMT
ఇండియన్‌ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని భారీ బడ్జెట్‌ తో '2.ఓ' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం 'ఇండియన్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2.ఓ చిత్రం సక్సెస్‌ అయినా కూడా భారీ బడ్జెట్‌ అవ్వడం వల్ల నష్టాలు వచ్చాయి. శంకర్‌ అంతకు ముందు సినిమా కూడా మంచి వసూళ్లు నమోదు అయినా కూడా భారీ బడ్జెట్‌ ఖర్చు చేయడం వల్ల నష్టాలే మిగిలాయి. తన గత చిత్రాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని శంకర్‌ కాస్త తగ్గి 'ఇండియన్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తాడని కొందరు అనుకున్నారు. కాని శంకర్‌ ఏమాత్రం తగ్గడం లేదు.

బడ్జెట్‌ విషయంలో ఇండియన్‌ 2 సినిమా ఆగిపోయిందని.. అంత బడ్జెట్‌ పెట్టలేమంటూ నిర్మాతలు తప్పుకున్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అవన్ని కూడా ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. సినిమాను శంకర్‌ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ రేంజ్‌ తెలియాలంటే ఈ సినిమా కోసం వేసిన ఒక్క సెట్టింగ్‌ ఖరీదు ఎంతో చెప్తే సరిపోతుంది. ఒక యాక్షన్‌ సీన్‌ కోసం దర్శకుడు శంకర్‌ ఏకంగా 40 కోట్ల సెట్‌ ను వేయించాడట. ఇక ఆ ఫైట్‌ కోసం భారీగా తారాగణం.. ఫైట్‌ మాస్టర్స్‌.. జూనియర్‌ ఆర్టిస్టులు అంతా కలిపి మరో పాతిక కోట్ల వరకు ఖర్చు అవుతుందట.

మొత్తం ఒక్క ఫైట్‌ కోసం 65 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడట. సౌత్‌ లో 65 కోట్ల బడ్జెట్‌ తో స్టార్‌ హీరోల భారీ బడ్జెట్‌ సినిమాను తీయవచ్చు. అలాంటిది ఒక్క ఫైట్‌ కోసం శంకర్‌ అంత బడ్జెట్‌ ను ఖర్చు చేయడంను చూస్తుంటే ఇండియన్‌ 2 సినిమా మొత్తం బడ్జెట్‌ ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. శంకర్‌ తన సినిమాలోని పాటల కోసం కూడా భారీగా సెట్టింగ్‌ లు వేయిస్తాడు. వాటితో కూడా కలిపి కేవలం సెట్టింగ్స్‌ కే వంద కోట్ల వరకు ఈయన ఖర్చు చేస్తున్నాడేమో అనిపిస్తుంది.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్‌ 2 చిత్రంలో హీరోయిన్‌ గా కాజల్‌ నటిస్తోంది. సిద్దార్థ.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఈ చిత్రంతో తన సినీ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే శంకర్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Tags:    

Similar News