ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఎన్ని రీమేకులు చేశారో తెలుసా?

Update: 2022-09-14 02:30 GMT
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలు చేసే చాలా సినిమాల్లో రీమేకులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను తెలుగులో ఎక్కువగా రీమేక్ చేసేవారు. ఆ తరువాత కాలంలో కోలీవుడ్ నుంచి కథల దిగుమతి ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పటి పటిస్థితికి వస్తే ప్రస్తుతానికైతే ఇక్కడ మలయాళ కథల జోరు నడుస్తోంది. మలయాళ కథల్లోని ఫీల్ ను ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడంటే కథల కొరత గనుక రీమేకులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు .. ఇంతకుముందు అలాంటి పరిస్థితి లేదని చాలామంది అనుకుంటారు.

కానీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి తెలుగు తెరను రీమేకులు పలకరిస్తూనే వస్తున్నాయి. ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఇతర భాషల్లోని సినిమాలు  .. అక్కడి కథల్లోని కొత్తదనం  .. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవారు. ఒక సినిమాకి అక్కడి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించిందంటే, ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన ఆసక్తిని కనబరిచేవారు. అలా ఆయన తన కెరియర్ మొత్తంలో 50 వరకూ రీమేకులు చేశారు. 42 వరకూ రీమేకులు చేసి ఆ తరువాత స్థానంలో ఏఎన్నార్ ఉన్నారు.

ఇక ఆ తరువాత ఇండస్ట్రీకి వచ్చినవారిలో కృష్ణ ఏకంగా హాలీవుడ్ సినిమాలనే రీమేక్ చేశారు. ఇక శోభన్ బాబు సినిమాల్లోను రీమేకులు ఉన్నాయి. ఈ వరుసలో ఉన్న హీరోల్లో కృష్ణంరాజు ఎక్కువ రీమేకులు చేశారు. ఆయన ఖాతాలో 25వరకూ రీమేకులు కనిపిస్తాయి.

ఆ తరువాత జనరేషన్లో రీమేకులకు వెంకటేశ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఆయన కూడా 25వ వరకూ రీమేకులు చేశారు. ఇక మెగాస్టార్ ఖాతాలోను 17వరకూ రీమేకులు కనిపిస్థాయి. త్వరలో ఆయన నుంచి రానున్న 'గాడ్ ఫాదర్' కూడా మలయాళ 'లూసిఫర్' కి  రీమేక్ నే.

బాలకృష్ణ తెలుగు కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చినప్పటికీ, ఆయన కూడా ఓ 12 రీమేకులు చేయ వలసి వచ్చింది. రీమేకుల వలన ఎక్కువ సక్సెస్ రేట్ ను అందుకున్న హీరో ఎవరంటే మాత్రం వెంకటేశ్ అనే చెప్పుకోవాలి.

రీమేక్ ల వలన ఒక ప్రయోజనం ఉంది. కథ తమ బాడీ లాంగ్వేజ్ కి సరిపోతుందా లేదా? తమకి గల ఇమేజ్ కి తగినట్టుగా  ఉందా లేదా? ఏ పాత్రలకి ఏ ఆర్టిస్టులు సరిపోతారు? ఎంత బడ్జెట్ లో .. ఎన్నో రోజుల్లో సినిమాను పూర్తి చేయవచ్చనే ఒక అవగాహన ముందే ఉంటుంది. అందువల్లనే పవన్ తో పాటు మిగతా హీరోలు కూడా ఇప్పుడు రీమేకుల పట్ల ఎక్కువ ఆసక్తిని .. ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇతర భాషల్లోని హీరోలు చేసిన కథలను ఇక్కడ మన హీరోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఇతర భాషల్లోని హీరోలు తమ భాషతో పాటు తెలుగులోను రిలీజ్ చేస్తుండటం కొసమెరుపు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News