మిర్చిలాంటి డార్లింగ్ కు ఓకే కానీ.. ఇప్పుడున్న ప్రభాస్ కి..?

Update: 2022-02-15 06:34 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దేశవ్యాప్తంగా వచ్చి పడిన ఫాలోయింగ్ ని.. పాన్ ఇండియా క్రేజ్ ని కాపాడుకునేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. విభిన్నమైన జోనర్స్ లో సరికొత్త కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం పీరియాడికల్ లవ్ స్టోరీ - మైథలాజికల్ - యాక్షన్ డ్రామా - సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ - హారర్ కామెడీ.. ఇలా వేటికవే ప్రత్యేకమైన జోనర్లలో సినిమాలు ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నా ఇందులో లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు ప్రభాస్ కు ఏ మేరకు సెట్ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన 'రాధే శ్యామ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. 1970స్ యూరప్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకు విధికి మధ్య జరిగే యుద్ధాన్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

'బాహుబలి' 'సాహో' సినిమాలతో ప్రభాస్ యాక్షన్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు 'రాధే శ్యామ్' సినిమా ఒక్క ఫైట్ కూడా లేకుండా పీరియాడికల్ ప్రేమకథగా తెరకెక్కుతోంది. గతంలో 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు మాస్ చిత్రాల్లో నటించిన ప్రభాస్.. ఈ రెండు చిత్రాలతో తనలో రొమాంటిక్ యాంగిల్ ని చూపించారు.

ఆ తర్వాత మళ్ళీ మాస్ బాట పట్టి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు లవ్ జోనర్ ను టచ్ చేశారు డార్లింగ్. అయితే 'రాధే శ్యామ్' సినిమా లవ్ జోనర్ అని తెలిసినప్పటి నుంచీ.. ప్రభాస్ కు సెట్ అవుతుందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పదేళ్ల క్రితం యంగ్ రెబల్ స్టార్ కు ప్రేమకథలు కానీ.. ఇప్పుడు ప్రభాస్ లుక్ కి సూట్ అవుతాయా? అనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ప్రభాస్ బాడీ సేఫ్ మునిపటిలా లేదనేది వాస్తవం. 'మిర్చి' సినిమా టైములో ఉన్న ప్రభాస్ కి ఇప్పుడున్న లుక్ కి చాలా తేడా ఉంది. ఇటీవల ఏపీ సీఎంతో భేటీ అయిన సమయంలో బయటకు వచ్చిన ప్రభాస్ ఫోటోలపై యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్లింగ్ కు లవ్ స్టోరీలు సరిపోతాయా అనే డిష్కసన్ జరుగుతోంది

Tags:    

Similar News