గ‌రుడ వేగ ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌టానికి వీల్లేదు

Update: 2018-04-12 05:40 GMT
ఒక చిత్రానికి ఒక‌సారి సెన్సార్ అయ్యాక ఎవ‌రూ దానిని అడ్డుకోవ‌టానికి వీల్లేదంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఉత్త‌ర్వులు జారీ చేసిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టాలీవుడ్ చిత్ర‌మైన గరుడ వేగ చిత్రాన్ని మ‌రెక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దంటూ సిటీ సివిల్ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఈ సినిమా కార‌ణంగా త‌మ సంస్థ ప్ర‌తిష్ట దెబ్బ తినేలా ఉందని.. దాని ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాలంటూ హైద‌రాబాద్ ఉప్ప‌ర‌ప‌ల్లిలోని ఆట‌మిక్ఎన‌ర్జీ డిపార్ట్ మెంట్‌కు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై విచారించిన సిటీ సివిల్ కోర్టు 4వ జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి విచార‌ణ జ‌రుపుతూ.. తాజాగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో గ‌రుడ‌వేగ చిత్రాన్ని టీవీల్లో కానీ.. యూట్యూబ్‌.. ఇత‌ర‌త్రా ఏ ర‌కంగానూ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌రాద‌ని.. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాలు.. ప్రెస్ మీట్లు నిర్వ‌హించ‌కూడ‌దంటూ నిర్మాత‌.. ద‌ర్శ‌కుడితో పాటు యూట్యూబ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి.

పిటిష‌న‌ర్ త‌ర‌ఫున లాయ‌ర్ శ్రీ హ‌ర్షారెడ్డి వాద‌న‌లు వినిపిస్తూ సినిమా మొత్తం యూరేనియం కార్పొరేష‌న్లో జ‌రిగిన కుంభ‌కోణం గురించే ఉంద‌న్నారు. త‌మ సంస్థ‌కు చెందిన యురేనియం ఫ్లాంట్ ఆంధ్రప్ర‌దేశ్ లోని తుమ్మ‌ల‌ప‌ల్లిలో ఉంద‌న్నారు. చిత్రంలో స్కాం ప్ర‌కారం చూస్తే.. తుమ్మ‌ల‌ప‌ల్లి ఎమ్మెల్యే.. హోంమంత్రి.. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ అధికారులు.. యురేనియం కార్పొరేష‌న్ ఛైర్మ‌న్.. ఉన్న‌తాధికారులు పాత్ర‌ధారులుగా చిత్రీకించార‌న్నారు.

ఎన్ ఐఏ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హీరో స్కాంను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న‌ట్లుగా చూపించ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వాద‌న‌లు విన్న జ‌డ్జి.. పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌తో ఏకీభ‌విస్తూ.. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కూ గ‌రుడ వేగ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాలంటూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌రి.. దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో?  ఏదైనా సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఇలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతాయి. కానీ.. గ‌రుడ వేగ మాత్రం విడుద‌లైన ఇన్ని రోజుల త‌ర్వాత (2017 న‌వంబ‌రు 7 రిలీజ్ అయ్యింది) కోర్టును ఆశ్ర‌యించ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News