రాజమౌళి గారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాను!

Update: 2022-03-19 15:36 GMT
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులంతా 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో  ఎదురుచూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో .. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కీరవాణి స్వరపరిచిన బాణీలు ఇప్పటికే జనంలోకి ఒక రేంజ్ లో దూసుకెళ్లాయి.  అలియా .. ఒలీవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదికకి కనుచూపు మేరలో జన ప్రవాహమే. కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా .. కర్ణాటక హెల్త్ మినిష్టర్ గౌరవ అతిథిగా .. శివరాజ్ఈ కుమార్ ప్రత్యేక అతిథిగా ఈ  వేడుకకి విచ్చేశారు. ఈ వేదికపై నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ .. "ఈ ఈవెంట్ కి విచ్చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి గారికీ .. హెల్త్ మినిష్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు పవర్ఫుల్ హీరోలతో ఈ సినిమాను రాజమౌళి గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి నిర్మాతగా ఉండే అవకాశం నాకు ఇచ్చారు. అందుకు నేను ఈ జన్మంతా ఆయనకి రుణపడి ఉంటాను.

నిజానికి నేను చాలా మాట్లాడాలని ఈ స్టేజ్ పైకి వచ్చాను. కానీ ఇంతమందిని ఇక్కడ ఇలా చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా టిక్కెట్ల రేటు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అనుమతిని ఇచ్చారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి  ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా టిక్కెట్ల విషయంలో ఇండస్ట్రీ తరఫున కృషి చేసిన  చిరంజీవిగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

అయితే వేదిక దిగి వెళ్లిన ఆయన వెనుదిరిగి వచ్చి "టెన్షన్ లో మరిచిపోయాను .. ఎన్టీఆర్ గారికీ .. చరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను .. ఏమీ అనుకోవద్దు" అని చెప్పేసి వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చి "శివరాజ్ కుమార్ గారిని మరిచిపోయినందుకు సారీ చెబుతున్నాను .. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్యూ సార్ .. టెన్షన్ లో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు" అన్నారు. ఆయన అలా ఒకటికి రెండుసార్లు స్టేజ్ పైకి వెళ్లడం .. తడబడటం చూసి ఎన్టీఆర్ .. చరణ్ .. రాజమౌళి సరదాగా నవ్వుకోవడం కనిపించింది. 
Tags:    

Similar News