డౌటక్కర్లేదంటున్న దానయ్య

Update: 2018-11-24 11:07 GMT
రామ్‌ చరణ్‌ - బోయపాటిల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ‘వినయ విధేయ రామ’ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చరణ్‌ మూవీ ఆలస్యం అవుతుందని - సంక్రాంతి బరి నుండి తప్పుకుందంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియా పుకార్లను నిర్మాత దానయ్య గట్టిగా తిప్పి కొట్టేలా ప్రకటన చేశాడు.

‘వినయ విధేయ రామ’ చిత్రం బ్యాలన్స్‌ ఉన్న ఒక్క పాట చిత్రీకరణకు అంతా సిద్దం అయ్యింది. డిసెంబర్‌ 10 నుండి ఆ పాట చిత్రీకరణ జరుపబోతున్నాం. ఆ పాట కోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ ను నిర్మించాం. సినిమాకు హైలైట్‌ అయ్యేలా ఆ పాట ఉంటుందని - దేవిశ్రీ ప్రసాద్‌ చాలా బాగా ఆ పాటను ట్యూన్‌ చేశాడని దానయ్య పేర్కొన్నాడు. ఆ పాటను అనుకున్న సమయంలో పూర్తి చేసి - ముందు నుండి చెబుతున్న ప్రకారం సంక్రాంతికి సినిమాను విడుదల చేసి తీరుతామని దానయ్య చెప్పుకొచ్చాడు.

దీపావళి సందర్బంగా విడుదలైన టీజర్‌ కు అద్బుతమైన స్పందన రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని - సినిమాకు కూడా అంతటి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని దానయ్య అన్నాడు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చరణ్‌ మూవీ అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే.

సంక్రాంతికి సినిమా డౌట్‌ లేకుండా వస్తుందని దానయ్య క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News