8 సినిమాలు ఒకేసారి.. థియేట‌ర్లు ఏవీ?

Update: 2019-11-18 01:30 GMT
థియేట‌ర్ల స‌మ‌స్య గురించి టాలీవుడ్ లో నిరంత‌రం చ‌ర్చ సాగుతుంటుంది. ఓవైపు థియేట‌ర్లు లేవు అంటూనే మ‌రోవైపు అవ‌స‌రానికి స‌రిప‌డా సినిమాలే లేవు! అనే వాళ్లు ఉన్నారు. ఇందులో ఏది నిజం?  ఏది అబ‌ద్ధ‌మో తెలీక సామాన్యులు బుర్ర పీక్కుంటారు. అయితే అతివృష్ఠి అనావృష్ఠి త‌ర‌హాలో ఉంటుంది మ‌న నిర్మాత‌ల ప్లానింగ్. ఉంటే ఉండొచ్చు.. లేక‌పోతే లేవు! అన్న‌ట్టుగానే ఉంటుంది ప‌రిస్థితి. పండ‌గలు ప‌బ్బాల వేళ అయితే ఒక‌టికి ప‌ది సినిమాలు రిలీజ్ కి క్యూ క‌డుతుంటాయి. అయితే ఇది పండ‌గ సీజ‌న్ కాక‌పోయినా కానీ వ‌రుస‌గా ఒకేసారి సినిమాల జాత‌ర చూస్తుంటే ఈ నవంబ‌ర్ కి ఏమైంది? అని సందేహించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

డిసెంబ‌ర్ లో పెద్ద సినిమాలు వ‌స్తున్నాయ‌న్న బెంగ వ‌ల్ల‌నో లేక ఇక ఇంత‌కుమించి మంచి సీజ‌న్ దొర‌క‌దు అని భావిస్తున్నారో కానీ రాబోవు శుక్ర‌వారం (ఈ నెల 22న) ఏకంగా ఎనిమిది సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే వాటికి సంబంధించిన రిలీజ్ తేదీల్ని ఫిక్స్ చేసుకుని ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లకు ఇచ్చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇంత‌కీ ఏఏ సినిమాలు ఈ శుక్ర‌వారం బ‌రిలో దిగుతున్నాయి? అంటే.. ఇప్పటి వరకు 22 వ తేదీకి 8 సినిమాలు తేదీలు అనౌన్స్ చేశారు. ఇప్ప‌టికే కొన్నిటికి దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు.

ఇషా రెబ్బా- రాగాల 24 గంటలలో.. జ్యోతిక‌- జాక్ పాట్.. సందీప్ - జార్జ్ రెడ్డి..  రాజేంద్ర ప్ర‌సాద్- తోలు బొమ్మ‌లాట చిత్రాల్ని ఈ శుక్ర‌వారం రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు ట్రాప్- రాజా నరసింహ-ర‌ణ‌ స్థలం- బీచ్ రోడ్ చిత్రాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో ఓ నాలుగు సినిమాలైనా స‌డెన్ గా రిలీజ్ తేదీ మారినా మారొచ్చు అంటూ ఒక పంపిణీదారుడు కం నిర్మాత విశ్లేషిస్తున్నారు. ఇన్ని సినిమాలు రిలీజ‌వుతుంటే థియేట‌ర్ల స‌మస్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది.  ప్రైమ్ ఏరియాల్లో థియేట‌ర్లు అన్నిటికీ దొర‌క‌డం క‌ష్టం. దాంతో కొంద‌రు వేచి చూసే వీలుంద‌ని చెబుతున్నారు. అయినా ఏ సినిమాకి అయినా మంచి రిలీజ్ అవ‌స‌రం. ఇలా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి రిలీజ్ చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న అంటున్నారు. ప్ర‌స్తుతం థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌లో అవ్య‌వ‌స్థ గురించి .. చిన్న సినిమాల పాట్ల గురించి ఆయ‌న కొంత ఆందోళ‌న‌గానే మాట్లాడారు మ‌రి.

ఇలా రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించేస్తే బ‌య్య‌ర్లు..డిస్ట్రిబ్యూటర్స్.. థియేటర్స్ ఎలా దొరుకుతాయి అన్న ఆందోళ‌న‌లోనే ఉంటార‌ట ప్ర‌తిసారీ. అయితే వెంకీ మామ‌- రూల‌ర్- ప్ర‌తిరోజు పండ‌గే- ద‌బాంగ్ 3 వంటి పెద్ద స్థాయి చిత్రాలు క్రేజు ఉన్న‌వి డిసెంబ‌ర్ లో రిలీజ్ కి వ‌స్తున్నాయి. వాటికి థియేట‌ర్లు స‌ర్దేందుకు ఇండ‌స్ట్రీ బిగ్ బీలే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వాటి మ‌ధ్య న‌లిగిపోవ‌డం ఎందుకులే అని కాస్తంత ముందుగానే అంద‌రూ స‌ర్ధుకుంటున్నార‌ట‌.


Tags:    

Similar News