'11:11' తో కోటి తనయుడు ఈసారైనా హిట్ కొడతాడా..?

Update: 2022-05-25 11:30 GMT
టాలీవుడ్ లో నట వారసులు తెరంగేట్రం చేసినట్లే దర్శక నిర్మాతలు.. సంగీత దర్శకుల వారసులు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే హీరోల పిల్లలు సక్సెస్ అయినట్లు.. టెక్నిషియన్స్ పిల్లలు కాలేదనే చెప్పాలి. కొందరు మాత్రం తమ టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.

లెజండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కూడా తండ్రి బాటలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్.. ఇప్పుడు హీరోగానూ వరుస విజయాలు అందుకుంటున్నాడు.

మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కూడా తన తండ్రి మాదిరిగానే మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోడానికి బాగా కష్ట పడుతున్నాడు. వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న మహతి.. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం అందుకున్నారు.

ఎంఎం కీరవాణి తన ఇద్దరు కుమారులనూ సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. పెద్ద కొడుకు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. మరో తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.

సీనియర్ సంగీత దర్శకుడు కోటి కూడా తన ఇద్దరు కొడుకులను టాలీవుడ్ కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. చిన్న కుమారుడు రోషన్ సాలూరి తండ్రి బాటలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. 'గాయకుడు' 'నిర్మలా కాన్వెంట్' 'క్షణ క్షణం' వంటి పలు సినిమాలకు సంగీతం అందించాడు.

కోటి మరో తనయుడు రాజీవ్ సాలూరి 2006 లో వచ్చిన 'నోట్ బుక్' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. తొలి సినిమా పర్వాలేదనిపోయించినా.. ఆ తర్వాత పేరు తెచ్చిపెట్టే సినిమా ఒక్కటీ రాలేదు. ఈ నేపథ్యంలో గత పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు రాజీవ్.

ఆకాశమే హద్దు - చిన్ని చిన్ని ఆశ - ఓరి దేవుడోయ్ - టైటానిక్ - ప్రేమంటే సులువు కాదురా' 'దెయ్యంతో సహజీవనం' వంటి సినిమాలు చేశాడు కానీ.. ఏదీ సక్సెస్ అందించలేదు. అయితే రాజీవ్ ''11:11'' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడు.

'11:11' సినిమాలో రాజీవ్ సాలూర్ సరసన వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. సదన్ - సీనియర్ హీరో రోహిత్ - లావణ్య - రాజా రవీంద్ర - రాజా శ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. RK నల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టైగర్ హిల్స్ ప్రొడక్షన్ మరియు స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేశ్ నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్.. దగ్గుబాటి రానా చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ క్రమంలో ఇప్పుడు ఉస్తాద్ హీరో పోతినేని రామ్ చేతుల మీదుగా 'ఏమయ్యిందో' అనే యూత్ ఫుల్ సాంగ్ ని విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. 'ఏమయ్యిందో మనసైపోయే మాయం ..' అంటూ సాగిన ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్న నేపథ్యంలో హీరోహీరోయిన్ల పై చిత్రీకరించిన ఈ పాట యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. రాకేందు మౌళి ఈ గీతానికి అర్థవంతమైన సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవి మాన్ల ఎడిటింగ్ చేశారు.
 
'11: 11' సినిమాలో రాజీవ్ సాలూర్ - వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. హీరోహీరోయిన్ల మధ్యలో అనూహ్యంగా ఓ వ్యక్తి ఎంటర్ అవడం.. ఈ క్రమంలో హత్యకు గురి కావడం.. దీంతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందిందని.. అతిత్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు. మరి కోటి తనయుడు ఈసారైనా హిట్ కొడతారేమో చూడాలి.


Full View
Tags:    

Similar News