ఎన్టీఆర్ క్లైమాక్స్ లో కొత్త ట్విస్ట్ ?

Update: 2018-08-19 07:11 GMT
షూటింగ్ మొదలుపెట్టినప్పటి సంగతి ఏమో కానీ మొన్న ఇండిపెండెన్స్ డేకి ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్యను చూసాక మాత్రం అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఆ పాత్రకు ఆయనే సరి అని అభిమానులు ముందు నుంచి నమ్మకంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకులు మాత్రం బాలయ్య ఎంతవరకు పెద్దాయన పాత్రకు నప్పుతాడా అనే అనుమానం కొంతవరకు ఉండింది. వాటికి  ఆ పోస్టర్ తో పూర్తిగా  చెక్ పడిపోయింది. మేకింగ్ లో దర్శకుడు క్రిష్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. నారా చంద్రబాబునాయుడు పాత్రకు రానాకు మేకప్ వేయించిన తీరు చూసి యూనిట్ కూడా షాక్ అయ్యిందని సమాచారం. ఇలా ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోసం తపిస్తున్న క్రిష్ ఈ బయోపిక్ లో పూర్తి కథను చూపిస్తాడా లేదా అనే అనుమానం అయితే ముందు నుంచి సలుపుతూనే ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ జీవితంలో బొమ్మా బొరుసు తరహాలో అన్ని రకాల ఒడిదుడుకులు ఉన్నాయి. అవన్నీ చూపిస్తే అభిమానుల మనోభావాల సమస్య రావొచ్చేమో అనే భయం కూడా కొందరిలో వెంటాడింది.

కానీ విశ్వసనీయ సమాచారం మేరకు బసవతారకం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ఎపిసోడ్ తోనే ఎన్టీఆర్ సినిమాకు ఎండ్ టైటిల్స్ వేస్తారని తెలిసింది. ఆవిడ దూరమైనప్పుడు ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ కంటతడిపెట్టించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అంత హెవీ ఎమోషన్ ఉన్న సీన్ కాబట్టే అక్కడితో ముగించాలని బాలయ్య క్రిష్ స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడే అనుకున్నారట. అంటే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలక భాగమైన 90 దశకం నాటి పరిణామాలు ఇందులో ఉండే ఛాన్స్ లేనట్టే. బసవతారకం గారు లోకాన్ని విడిచి వెళ్ళింది 1985లో. అప్పుడు టిడిపి అధికారంలో ఉంది. ఆ తర్వాత రెండో సారి అధికారం చెప్పట్టడం కుట్రలు జరగడం లక్ష్మి పార్వతితో పరిచయం రెండో పెళ్లి  ఈ ఘట్టాలన్నీ ఏ మాత్రం చూపించే ఛాన్స్ లేనట్టే. అంటే ఎన్టీఆర్ జీవితంలోని 10 ఏళ్ళ కాలాన్ని అంటే 1986-1996 వరకు జరిగింది చూపరన్న మాట. ఇది నిజమో కాదో కానీ ఫిలిం నగర్ లో మాత్రం దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఒకవేళ నిజమే అయితే అసంపూర్ణంగా అనిపించే కథను మెప్పించేలా క్రిష్ ఎలా తీసుంటాడు  అనేది పజిల్ గా మారింది. చూద్దాం ముందు ముందు ఇంకెలాంటి అప్ డేట్స్ రాబోతున్నాయో.
Tags:    

Similar News