సుశాంత్ సూసైడ్ కేసుపై దృష్టి సారించిన ఈడీ...!

Update: 2020-07-30 17:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసు రోజులు గడిచే కొద్దీ అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కేసు రియా వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఐదు పేజీల కంప్లైంట్ లో సుశాంత్ ను రియా సూసైడ్ కు ప్రేరేపించిందని ఆర్థికంగా మోసం చేసిందని మానసికంగా వేధించిందని ఆయన ఆరోపించారు. దీంతో రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇన్ని రోజులు సుశాంత్ మరణంతో రియా బాధలో కూరుకుపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆమె వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పటి వరకు ముంబై పోలీసులు మాత్రమే విచారణ చేపడుతున్న సుశాంత్ సూసైడ్ కేసులో ఇప్పుడు బీహార్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి రియా పాత్రపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసు విచారణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా సుశాంత్ సింగ్ ఆర్థిక లావాదేవీలలో రియా పాత్ర ఉందని.. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుండి అజ్ఞాత వ్యక్తుల బ్యాంకు ఖాతాకు రూ. 15 కోట్లు వేరే వారికి బదిలీ అయ్యాయని సుశాంత్ తండ్రి కంప్లైంట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా సుశాంత్ తన ఆర్థిక వ్యవహారాలను చూసుకునే బాధ్యత రియాకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎంక్వైరీ చేసిన బీహార్ పోలీసులు సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు రియా చక్రవర్తి మాయం చేసినట్లు గుర్తించారని సమాచారం. దీంతో ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ.. ఆ డబ్బును రియా ఎవరికి బదిలీ చేసింది.. ఎందుకు బదిలీ చేసిందనే విషయాలపై విచారణ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్ పోలీసులు ముంబైలోని బాంద్రా కొటక్ మహీంద్రా బ్రాంచ్ లో సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద సూసైడ్ కేసు ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టూనే తిరుగుతోందని అర్థం అవుతోంది.
Tags:    

Similar News