టిక్కెట్టు రేటుపై ఏపీ ప్ర‌భుత్వాని‌కి ఎగ్జిబిట‌ర్ల మొర‌!

Update: 2021-04-14 16:30 GMT
వ‌కీల్ సాబ్ దృష్ఠాంతం ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల్ని ప‌రిశ్ర‌మ‌కు సంధించింది. టిక్కెట్ రేట్ల‌ను పెంచితే లాభ‌ప‌డేది ఎవ‌రు? అన్న‌దానిపైనా చాలా క్లారిటీ వ‌చ్చింది. నిజానికి టిక్కెట్టు రేట్లు పెంచితే లాభ‌ప‌డేది ఎగ్జిబిట‌ర్ (థియేట‌ర్ య‌జ‌మాని లేదా లీజుదారు) అనే అనుకునేవాళ్ల‌కు దీనిపై చాలా క్లారిటీ వ‌చ్చేస్తోంది.

వాస్త‌వానికి ఎగ్జిబిష‌న్ రంగం చాలా కాలంగా చిక్కుల్లో ఉంది. ఈ రంగంలో పెట్టుబ‌డులు అధికం లాభాలు శూన్యం అన్న ఆవేద‌న నిరంత‌రం క‌నిపిస్తూనే ఉంది. పెరుగుతున్న సాంకేతిక‌త‌కు త‌గ్గ‌ట్టు గ‌త కొన్నేళ్ల‌లో కోట్లాది రూపాయ‌ల్ని థియేట‌ర్ల అధునాత‌న సాంకేతిక‌త (డీటీఎస్ ప్రొజెక్ష‌న్ వ‌గైరా) కోస‌మే ఖర్చు చేసిన‌వాళ్లు ఉన్నారు. ఆ ఖ‌ర్చుల‌న్నీ ఇప్పుడు రాబ‌ట్టుకోవాలి. కానీ ఇంత‌లోనే ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్టు రేట్ల త‌గ్గింపు నిర్ణయం తీసుకుంది. వ‌కీల్ సాబ్ పై క‌క్ష‌పూరితంగా వ్యవ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి ఏదైనా సినిమాకి భారీగా లాభాలొస్తే అవి హీరోల ఖాతాలోకే వెళ‌తాయి. కానీ ఎగ్జిబిట‌ర్ వాటాలోకి రావు. వారికి ద‌క్కేది కేవ‌లం 25 -30శాతం లాభంలో వాటా మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని చెబుతారు. పైగా థియేట‌ర్ల‌లో సినిమాని ప్ర‌ద‌ర్శించే వాళ్ల‌లో ఎక్కువ‌మంది ఎగ్జిబిట‌ర్లే ఉన్నారు. అంటే వారు ప్ర‌ద‌ర్శ‌న హ‌క్కుల్ని పెద్ద మొత్తాల్ని వెచ్చించి కొనుగోలు చేయాలి.

అంటే థియేట‌ర్ల నుంచి వ‌చ్చే క‌లెక్ష‌న్ల రూపంలోనే వారికి సినిమా కొనుగోలుకు పెట్టిన పెట్టుబ‌డి రావాలి. థియేట‌ర్ల‌కు పెట్టిన పెట్టుబ‌డి రావాల్సి ఉంటుంది. కానీ య‌థార్థ స‌న్నివేశం వేరుగా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్మినా వ‌చ్చే లాభంలో ఎగ్జిబిట‌ర్ కి ఏమీ ఉండ‌దు. థియేట‌ర్ ఉద్యోగుల‌కు జీతాలిచ్చి మెయింటెయిన్ చేసేదానికే ఎక్కువ‌గా అయిపోతోంది. క‌రెంట్ బిల్లులు వ‌గైరా త‌డిసిమోపెడు అవుతుంటాయి. ఇక మ‌హ‌మ్మారీ క‌ష్ట‌కాలంలో ఇది మ‌రింత‌గా న‌ష్టాన్ని క‌ల‌గ‌జేసింది.

వ‌కీల్ సాబ్ టికెట్ ధ‌ర‌ల్ని త‌గ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఏకంగా ప‌దేళ్ల నాటి టిక్కెట్టు ధ‌ర‌ల్ని నిర్ణ‌యించారు. దీంతో థియేట‌ర్ య‌జ‌మానులు ల‌బోదిబోమనాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది‌. వ‌కీల్ సాబ్ కి హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్లు వ‌చ్చినా త‌మ పెట్టుబ‌డులు తిరిగి రావ‌డం లేద‌ని ప్ర‌ద‌ర్శ‌న‌కారులు చెబుతున్నారు. వ‌చ్చే లాభంలో ఎక్కువ వాటా హీరోకే వెళుతుంద‌ని నివేదిస్తున్నారు.

ఇక‌పోతే ఈ ప‌రిస్థితిలో ప్ర‌భుత్వంతో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేవాళ్లు కూడా క‌రువ‌య్యారు. టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై ఇప్పటివ‌ర‌కూ ఒక్క సినీపెద్ద కూడా స్పందించ‌లేదు. పైగా ప్ర‌భుత్వానికే అంద‌రూ వంత‌పాడ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీంతో ఇక చేసేదేమీ లేక ఎగ్జిబిట‌ర్లంతా ఏక‌మై ఏపీ ప్ర‌భుత్వానికి మొర‌పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఇప్పుడున్న ప‌దేళ్ల నాటి టిక్కెట్టు ధ‌ర‌ల‌తో థియేట‌ర్ రంగం బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి విన్న‌వించ‌నున్నార‌ట‌.

ఒక‌వేళ టిక్కెట్టు ధ‌ర‌లు మార‌క‌పోతే థియేట‌ర్ల‌ను మూసివేసే ఆలోచ‌న కూడా ఉందిట‌. మునుప‌టి ధ‌ర‌లు తిరిగి వ‌స్తే.. క‌నీసం త‌మ వాటాలో కొంత మేలు జ‌రుగుతుంద‌నేది ఆలోచ‌న‌. మెజారిటీ 60శాతం వాటా మ‌ళ్లీ య‌థావిధిగానే హీరోలు ద‌ర్శ‌కుల ప్యాకేజీలు వాటాల్లోకే వెళుతుంది.
Tags:    

Similar News