'ఎఫ్ 3' పబ్లిక్ టాక్..!

Update: 2022-05-27 05:55 GMT
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''ఎఫ్ 3''. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూర్చారు. 2019 సంక్రాంతి సీజన్ లో ఘనవిజయం సాధించిన 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో ఈ సినిమా తెరకెక్కింది.

సమ్మర్ సోగ్గాళ్ళు మూడింతల వినోదం అందించబోతున్నారని ప్రచారం చేయబడిన 'ఎఫ్ 3' సినిమా ఈరోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మొదటి ఆట చూసిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా రివ్యూలు రేటింగులు ఇచ్చేస్తున్నారు.

'ఎఫ్ 2' లో మెయిన్ క్యారెక్టరైజేషన్లతో కొత్త కథతో ''ఎఫ్ 3'' చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. అందులో భార్యాభర్తల కథకు ఫన్ అండ్ ఫస్ర్టేషన్ కలిపి చూపిస్తే.. ఇక్కడ కథంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. వెంకటేష్ రేచీకటి బాధితుడిగా ఎప్పటిలాగానే తన మార్క్ టైమింగ్‌ తో అద‌ర‌గొట్టేశాడు. ఇక వరుణ్ తేజ్ నత్తితో మాట్లాడే యువకుడిగా నవ్వులు పూయించారు.

చెప్పుకోడానికి క‌థ ఏమీ పెద్ద‌గా లేక‌పోయినా.. ఆధ్యంతం ఎంటర్టైన్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను నడిపించారు. తమన్నా భాటియా మరియు మెహ్రీన్ ఇద్దరూ తగినంత గ్లామర్ డోస్ అందించగా.. సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ లో మెరిసింది. సునీల్‌ - అలీ కామెడీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు.

వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ - ప్రగతి - అన్నపూర్ణ - వై విజయ వంటి భారీ తారాగణాన్ని అనిల్ హ్యాండిల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించినా.. పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయిందని అంటున్నారు.

దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక మైన‌స్‌ అని పబ్లిక్ టాక్ ని బట్టి తెలుస్తోంది. సినిమాను తన మార్కు కామెడీతో నడిపించిన అనిల్ రావిపూడి.. కొన్నిచోట్ల కామెడీ సీన్లను బలవంతంగా పెట్టినట్లు ఉందని అంటున్నారు. పేరడీ కామెడీ మరియు టాలీవుడ్ సూపర్‌ స్టార్స్‌ ని ఉపయోగించుకోవడం ఆయా అభిమానులను కొంతవరకు ఆకట్టుకుంటుంది.

ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సమయంలో ఈవీవీ సినిమా కామెడీని గుర్తు చేస్తుందని అంటున్నారు. 'ఎఫ్ 2' కంటే ఇది ఎక్కువ నవ్వించిందని కొందరు అంటుంటే.. 'f 2' కి మూడింతలు ఫన్ మాత్రం కాదని మరికొందరు అంటున్నారు. ఓవరాల్‌ గా 'ఎఫ్ 3' కథ గురించి ఆలోచించకుండా చూస్తే నవ్వుకుంటూ థియేటర్లలో నుంచి బయటకు రావొచ్చని పబ్లిక్ టాక్ ని బట్టి తెలుస్తుంది.
Tags:    

Similar News