టాలీవుడ్ ఏపీ జంప్‌.. తెర‌వెన‌క న‌గ్నస‌త్యం!!

Update: 2019-03-16 05:28 GMT
ఫిలింఇండ‌స్ట్రీ(టాలీవుడ్) ఏపీకి వెళుతుందా?  వెళ్ల‌దా? ఏపీ - తెలంగాణ విడిపోయాక సినీ పెద్ద‌లు స‌హా సినీప‌రిశ్ర‌మ యావ‌త్తూ - తెలుగు రాష్ట్రాల 9 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో సాగిన ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది. ఏపీకి వెళుతుంద‌ని కొంద‌రు.. వెళ్ల‌ద‌ని మ‌రికొంద‌రు అన్నారు. సినీపెద్ద‌ల్లోనే దీనిపై ఎంతో విభిన్న‌మైన వాద‌న‌లు వినిపించాయి. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం టాలీవుడ్ ఎటూ వెళ్ల‌కుండా తేరాస ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు వ‌ర్క‌వుట‌వ్వ‌డంతో సినీపెద్ద‌లు కూడా ఈ విష‌యంలో సైలెంట్ అయ్యారు. అయితే ఏపీలోనూ మ‌రో కొత్త టాలీవుడ్ అంకురార్ప‌ణ జ‌రుగుతోంద‌ని, ఎపీఎఫ్‌ డీసీ ఆధ్వ‌ర్యంలో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు స‌న్నాహాలు చేస్తున్నామని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఏపీఎఫ్‌ డీసీ అధ్య‌క్షుడు అంబికా కృష్ణ ప్ర‌భృతులు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. మీడియాల‌కు ప్రెస్ నోట్లు పంపించారు. కానీ అదంతా బూట‌క ప్ర‌చారమ‌ని అర్థం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. వైజాగ్ బీచ్ కారిడార్ లో ఇప్ప‌టికీ స్టూడియోల రూప‌క‌ల్ప‌న గురించి కానీ - దేని గురించీ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డిందే లేదని తెలుస్తోంది. గ‌తంలో ఎంపీ ముర‌ళీమోహ‌న్ ని ఫిలింఛాంబ‌ర్ స‌మావేశంలో ఏపీ టాలీవుడ్ పై ప్ర‌శ్నిస్తే త‌డ‌బ‌డిన‌ప్పుడే స‌న్నివేశం ఏంటో అర్థ‌మైంది. ఆయ‌న‌ నీళ్లు న‌మిలిన వైనంపైనా మీడియాలో చ‌ర్చ సాగింది. ముర‌ళీమోహ‌న్ కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు పై బ‌య‌ట‌కు చెప్పేది ఒక‌టి.. అంత‌ర్గ‌త ఆలోచ‌న వేరు అని అర్థ‌మైంది. ఓ విలేక‌రి నుంచి ఊహించ‌ని ఆ ప్ర‌శ్న‌కు ముర‌ళీమోహ‌న్ తో పాటు `హైద‌రాబాద్‌ లో ఇళ్ల స్థ‌లాల‌` ప‌రిశీల‌న‌లో బిజీగా ఉన్న సినీమీడియా కూడా గ‌తుక్కుమంది.

అస‌లింత‌కీ ఏపీలో కొత్త ఇండస్ట్రీ ఏర్పాటు వ్య‌వ‌హారంలో నిజాయితీ ఎంత‌? అంటే... అంతా శూన్యం అన్న వాద‌నా మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ విష‌యంపై హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ తో అనుబంధం క‌లిగి.. ఏపీ ఫిలించాంబ‌ర్ (బెజ‌వాడ‌) లో విధులు నిర్వ‌హించే ఓ పెద్దాయ‌న చెప్పిన న‌గ్న స‌త్యం ప‌రిశీలిస్తే అస‌లు సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. ఏపీ నంది అవార్డుల వేళ సినీపెద్ద‌లు క‌లిసిన‌ప్పుడు కొత్త ఇండ‌స్ట్రీ ప్ర‌పోజ‌ల్ కి అంగీక‌రించిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత దాని ఊసే మ‌ర్చిపోయారు. ఎఫ్‌ డీసీ పేరుతో అంబికా కృష్ణ సైతం తూతూగా కొన్ని చేస్తున్న‌ట్టు హ‌డావుడి చేశారంతే. ఇక చంద్ర‌బాబు  కానీ - ముర‌ళీ మోహ‌న్ కానీ .. కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు పూర్తి వ్య‌తిరేకం. అందుకు స‌హేతుక కార‌ణం లేక‌పోలేద‌ని విశ్లేష‌ణ వెలువ‌డింది.

ఒక‌వేళ ఏపీకి సినీప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాలంటే అది బ‌య‌ట‌కు క‌నిపించేంతు సులువైన ప్ర‌క్రియ కాదు. ఇది కొంద‌రు సినీ పెద్ద‌ల ఆస్తుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంగా చూడాల్సి ఉంటుంది. హైద‌రాబాద్  లో ఉన్న ఆస్తులు త‌ర‌లించ‌డం అనేది ఎంతో ఇబ్బందిక‌రమైన ప్ర‌క్రియ‌. సినీపెద్ద‌ల ఆస్తుల‌న్నీ హైద‌రాబాద్ లో ఉండ‌డం వ‌ల్ల‌నే వాటిని త‌ర‌లించేందుకు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌రు. పైగా టాలీవుడ్ ని త‌ర‌లిస్తామంటే ఇక్క‌డ విప్ల‌వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ‌రోసారి తెరాస పెద్ద‌ల నుంచి ఎటాక్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఎక్క‌డ దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్.. సైలెన్స్.. అన్న చందంగా ఉన్నారు.. అంటూ ఓ లోగుట్టు గురించి మాట్లాడారాయ‌న‌. అయితే ఇక్క‌డే ఓ ప్ర‌శ్న కూడా పుడుతుంది. హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీలో కీల‌క భూమిక పోషించే ఏపీ సినీపెద్ద‌లు ఏపీ ఇండ‌స్ట్రీ గురించి నిజాయితీగా ఆలోచించ‌డం లేదా? ఏపీకి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ అవ‌స‌రం లేదా?!!  అక్క‌డ ప్ర‌జ‌ల‌కు రంగుల ప్ర‌పంచం మ‌హ‌త్తు అవ‌స‌రం లేదా?  అంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏపీ - టాలీవుడ్ గురించి తాజా ఎన్నిక‌ల హ‌డావుడిలోనూ నాయ‌కుల్లో ఎలాంటి చ‌ర్చా సాగ‌క‌పోవ‌డంపైనా విమ‌ర్శ‌లొస్తున్నాయి.
Tags:    

Similar News