ఆ సూప‌ర్ స్టార్‌ ఫ్యాన్స్ కి భంగ‌పాటు

Update: 2020-07-21 08:30 GMT
ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్ ఎంత వైల్డ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నే లేదు. త‌మ ఫేవ‌రెట్ ని ఎప్పుడూ నంబ‌ర్ వ‌న్ గా చూడాల‌న్న త‌హ‌త‌హ ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ లో ర‌గులుతూనే ఉంటుంది. ఇక అత‌డు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు అన్న వార్త‌ల‌తో ఇది ప‌రాకాష్ట‌కే చేరుకుంది. ఎంత‌గా అంటే అస‌లు ర‌జ‌నీ అయినా అజిత్ అయినా ఇల‌‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత‌నే అనేంత‌గా ప్ర‌చారం సాగిస్తున్నారు. ఒక్కోసారి ఈ ప్రచారం హ‌ద్దు మీరుతూ విజ‌య్ కి త‌ల బొప్పి క‌ట్టించేస్తున్నారు. తెలిసో తెలియ‌కో ఆ త‌ప్పు అలా జ‌రిగిపోతోంది.

తాజాగా మ‌రోసారి అలాంటి త‌ప్పిద‌మే చేసి అడ్డంగా దొరికిపోయారు విజ‌య్ ఫ్యాన్స్. మా హీరో సూప‌రు.. టీవీ టీఆర్పీల్లోనూ నంబ‌ర్ 1 అత‌డే. ఈ విష‌యాన్ని బార్క్ ధృవీక‌రించింది అంటూ బీరాలు పోయారు. అంతేకాదు.. మా హీరో కంటే టీవీక్ష‌ణ‌లో ర‌జ‌నీకాంత్ - ప్ర‌భాస్ - అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్లే వెన‌క‌బ‌డ్డార‌ని ప్ర‌చారం చేశారు‌. బార్క్ రిపోర్ట్ ప్ర‌కారం.. లారెన్స్ - ర‌జ‌నీకాంత్- ప్ర‌భాస్ - అక్ష‌య్ కుమార్ టీఆర్పీలో తొలి ఐదు స్థానాల్లో ఉండ‌గా విజ‌య్ వీళ్లంద‌రినీ వెన‌క్కి నెట్టేసి నంబ‌ర్ 1 స్థానంలో నిలిచార‌ట‌. లాక్ డౌన్ 2020లో 13 తేదీ నుంచి 27 వ తేదీ మ‌ధ్య‌లో టీవీక్ష‌ణ టీఆర్పీలో విజ‌య్ ఏకంగా 117 మిలియ‌న్ల వ్యూస్ తో నంబ‌ర్ వ‌న్ అయ్యాడ‌ట‌. ఇత‌రులంతా ఆ త‌ర్వాత‌నే అని ఏదో చెప్ప‌బోతే ఇంకేదో అయ్యింది.

బార్క్ ఇండియా ప్ర‌తినిధులు ఈ విష‌యాన్ని గ్ర‌హించి వెంట‌నే విజ‌య్ ఫ్యాన్స్ కి కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు ఈ అవాస్త‌వాల్ని న‌మ్మ‌కండి. మేం ఎక్క‌డా ఈ విష‌యాన్ని చెప్ప‌లేదు.. ప్ర‌చురించ‌లేదు. బార్క్ అధికారిక వెబ్ సైట్లో ప్ర‌చురించే విష‌యాలు మాత్ర‌మే ప‌రిశీలించండి. విజ‌య్ ఫ్యాన్స్ చేస్తున్న అస‌త్య ప్ర‌చారం న‌మ్మొద్దు! అంటూ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా ఖంగు తిన‌డం వీళ్ల వంతైంది.

విజ‌య్ గొప్ప స్టార్. అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న స్టార్. వ‌రుస విజ‌యాలు ద‌క్కుతున్నాయి. కాద‌న‌లేం.. కానీ ఇలా నంబ‌ర్ 1 అని చెప్పేందుకు ఇలా అడ్డ‌మైన గ‌డ్డి తి‌న‌డం ఎందుకు? అనేది ఇత‌ర స్టార్ల అభిమానుల ప్ర‌శ్న‌. మ‌రి దీనికి స‌మాధానం ఏం చెబుతారో తంబీలు. ఇప్పుడు బార్క్ లోగోని ఉపయోగించి త‌ప్పుడు ప్ర‌చారం చేసినందుకు బార్క్ వాళ్లు దావా వేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. తాజా ప‌రిణామంతో మ‌రోసారి విజ‌య్ కి నిజంగానే బొప్పి క‌ట్టిన‌ట్టే.
Tags:    

Similar News