#ధ‌ర్మ‌సందేహం.. హీరోల కాళ్లపై ప‌డుతున్నారు.. భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మా?

Update: 2021-03-10 08:30 GMT
టాలీవుడ్ హీరోల‌ను దేవుళ్ల‌తో స‌మానంగా పూజిస్తారు అభిమానులు. త‌మ అభిమాన దేవుడి పాదాల‌పై ప‌డి న‌మ‌స్క‌రించ‌నిదే నిదురుపోలేరు కొంద‌రు వీరాభిమానులు. అందుకే ప్ర‌తిసారీ ఏదైనా ఈవెంట్ ఉంది అంటే అక్క‌డ అభిమానులంతా పోగ‌వుతారు. వీలు చూసుకుని చ‌టుక్కున స్టేజీ పైకి ఎక్కేస్తారు. ఆ త‌ర్వాత అరిచి గోల చేస్తారు. ఆన‌క సెల్ఫీలు కావాలంటారు. అంతేనా.. పాదాల‌పై ప‌డి న‌మ‌స్కారాలు పెట్టేస్తూ నానా యాగీ చేసేస్తారు.

ఇలాంటివి అరుదుగా అయినా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అయితే అంద‌రు హీరోల‌కు అలా పాదాలు మొక్కే అభిమాన భ‌క్తులు ఉండ‌రు. ఎవ‌రో కొంద‌రికే అది సాధ్యం. నిన్న సాయంత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `చావు క‌బురు చ‌ల్ల‌గా` ప్రీరిలీజ్ వేదిక ఎక్కాక అక్క‌డ ఆ దృశ్యం అంద‌రినీ షాక్ కి గురి చేసింది. ఆయ‌న మాట్లాడుతుంటే మాట్లాడ‌నివ్వ‌రు. అరిచి గోల చేస్తారు. డిస్ట్ర‌బ్ చేస్తారు. చివ‌రికి పాదాల‌పైనే ప‌డ‌తారు!

ఓ అభిమాని నేరుగా వేదిక ఎక్కి బ‌న్ని పాదాల‌పైనే ప‌డ్డాడు. దీంతో ఆయ‌న‌ పాదాల‌పైనే ఎందుకు ప‌డ‌తారు? అన్న చ‌ర్చా నెటిజ‌నుల‌లో వేడెక్కించింది. ఆ హీరో పాదాల‌పైనే ఎందుకని ప‌డ‌తారు?  కార‌ణం ఏమై ఉంటుంది? అన్న చ‌ర్చా సాగింది. అయితే బ‌న్ని మాత్రం ఎంతో హుందాగా ఎవ‌రైనా పంపారా? అంటూ స‌ర‌దాగా న‌వ్వేస్తూనే ఆ అభిమానిని పంపించేశారు. స్పీచ్ ని ఆపేస్తున్నందుకు కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేసినా బ‌న్ని ఆ ఘ‌ట‌న‌ను స‌ద్ధుమ‌ణిగేలా చేశారు. అయితే జ‌నాల్లోనే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది.

అంత‌మంది బౌన్స‌ర్ల న‌డుమ బ‌న్ని మీదికి వ‌చ్చేస్తుంటే అభిమానుల్ని ఎందుక‌ని ఆప‌లేక‌పోయారు?  ఇలా అయితే భ‌ద్ర‌త ఎలా? అన్న ప్ర‌శ్నా త‌లెత్తింది. స్టార్ హీరోల‌కు నిజంగానే వేదిక‌ల‌పై భ‌ద్ర‌త లేన‌ట్టేనా.. ఇది బౌన్స‌ర్ల వైఫ‌ల్య‌మా.. భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మా? అంటూ ఒక‌టే వాడి వేడి డిబేట్ సోష‌ల్ మీడియాల్లో ర‌న్ అవుతోంది.

మొన్న‌టికి మొన్న బీచ్ సొగ‌సుల వైజాగ్ లో జ‌రిగిన ఓ ఈవెంట్లో న‌వ‌త‌రం హీరో ఏజెంట్ ఆత్రేయ న‌వీన్ పోలిశెట్టి కాళ్ల మీద ఓ వీరాభిమాని ఇలానే ప‌డ్డాడు. దాంతో ఖంగు తిన్న న‌వీన్ వెంట‌నే స‌ర్ధి చెప్పి ఈవెంట్ ని స‌ర‌దా వ్యాఖ్య‌ల‌తో ఆహ్లాదంగా మార్చేసారు. ఈసారి బ‌న్నికి ఇలాంటిదే ఎదురైంది. దానిని అత‌డు లైట్ తీస్కున్నాడు. అది ఎలా జ‌రిగినా కానీ హీరోల‌కు భ‌ద్ర‌త ఏదీ? అన్న‌దే ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌న్న చ‌ర్చా సాగుతోంది.
Tags:    

Similar News