అమరావతిలో సినిమా స్కూల్

Update: 2017-07-06 06:16 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలుగా మారిన తర్వాత.. ఏపీలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు.. ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. హైద్రాబాద్ లో కేంద్రీకృతం అయిన తెలుగు సినిమా పరిశ్రమను.. ఏపీకి తరలించడం కష్టమే అనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తం అయ్యాయి.

ఇప్పుడు సినిమా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీ రాజధాని అమరావతిలో సినిమా.. టీవీ రంగాలకు చెందిన స్కూల్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది సర్కారు. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అందిన సిఫార్సుల మేరకు.. అమరావతి లో ఓ ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.

సినిమా.. టీవీ రంగాలకు చెందిన అన్ని విభాగాలకు సంబంధించిన కోర్సులు ఇందులో ఉండేలా చర్యలు తీసుకుంటారట. నటనతో పాటు పలు సాంకేతిక విభాగాల్లో ఆసక్తి ఉన్న వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఈ ఇనిస్టిట్యూట్ ఉపయోగపడనుందని అంటున్నారు. ఈ పాఠశాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే జీవోను కూడా రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని చెప్పచ్చు.
Tags:    

Similar News