కొత్త సెంటిమెంట్ దడ: భారీ అంటే చాలు భయపెడుతున్నాయట

Update: 2022-08-26 05:36 GMT
సెకండ్ వేవ్ తో దిమ్మ తిరిగిపోయిన సినిమా పరిశ్రమ.. కాస్తంత కోలుకోవటానికి చాలానే టైం పట్టింది. మూడో వేవ్ తో మరో భారీ దెబ్బ పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమైనా.. లక్కీగా అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. దీంతో.. సినిమా పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది చివరి నుంచి మొదలైన సినిమాల పండుగ.. ఈ ఏడాది కాస్త లేటుగా మొదలైనా.. వరుస పెట్టి విడుదలైన సినిమాలు చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఈ ఏడాది చోటు చేసుకున్న ఆసక్తికరమైన సీన్ ఏమంటే.. భారీ బడ్జెట్ సినిమాలు.. భారీ అంచనాలు ఉన్న సినిమాలు.. బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేస్తాయన్న అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలన్ని బొక్కబోర్లా పడటమే కాదు.. దర్శక నిర్మాతలకే కాదు.. సదరు హీరోలకు భారీ నిరాశను మిగిల్చాయి. ఈ ట్రెండ్ షురూ అయ్యింది మార్చిలో విడుదలైన 'ఈటీ'తో. సూర్య నటించిన ఈ తమిళ సినిమా మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. కానీ.. అందుకు భిన్నంగా ఈ సినిమా అస్సలు ఆడలేదు. ఈ సినిమా విడుదలైన రోజు తర్వాత భారీ అంచనాలతో విడుదలైన డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ తీవ్రంగా నిరాశ పర్చటం తెలిసిందే.

ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఎక్కడ లెక్క తేడా కొట్టిందన్న విషయాన్ని చెప్పుకోలేని పరిస్థితి. తమ డార్లింగ్ సినిమాను ఎత్తేందుకు ఎంత ప్రయత్నించినా.. బాక్సాఫీస్ లో మాత్రం ఎలాంటి స్పందనలు కనిపించని పరిస్థితి. రాధేశ్యామ్ తేడా కొట్టిన తర్వాత వచ్చిన మరో భారీ మూవీ.. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్. ఈ మూవీ మాత్రం మిగిలిన సినిమాలకు భిన్నంగా.. అంచనాలకు తగ్గట్లుగా విజయం సాధించిన బాక్సాఫీస్ కళకళలాడేలా చేసింది.

ఈ విజయంతో కాస్తంత ధైర్యం తెచ్చుకొని విడుదలైన మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య'. ఈ సినిమా మీదా భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కేజీఎఫ్ చాఫ్టర్ 2 మాత్రం భిన్నమైన ఫలితాన్ని ఇవ్వటంతో కాస్తంత సాంత్వన పొందినప్పటికీ.. బీస్ట్ దెబ్బకు దర్శక నిర్మాతలకు ఎదురైన రీసౌండ్ అంతా ఇంతా కాదు. భారీ చిత్రంగా.. పెద్ద ఎత్తున అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఎదురుదెబ్బ తగలక తప్పలేదు.  

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మూవీ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. 'కళావతి' పాటతో ఈ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయి.. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ఖాయమన్న లెక్కలు వినిపించాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫలితం గురించి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కూడా పలు సినిమాలు విడుదలైనా.. భారీతనంతో రూపొందించిన సినిమాలు తక్కువే.

అయితే.. లైగర్ ఇందుకు భిన్నమని చెప్పాలి. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే భారీ అంచనాలు వ్యక్తమయ్యాయి. దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేయటం.. కరణ్ జోహార్ లాంటోడు రంగంలోకి దిగిన తర్వాత.. ఈ సినిమా స్థాయి పూర్తిగా మారింది. దీనికి తోడు విజయ్ మేకోవర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందన్న మాట వినిపించింది. యావత్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ తాజాగా విడుదలైంది.

విడుదలకు ముందు ఈ సినిమాను ప్రమోట్ చేసిన వైనం చూసినోళ్లు.. ఒక సినిమాకు హైప్ ఎంతలా పెంచొచ్చన్న విషయాన్ని దీనికి చేసిన ప్లానింగ్ తో ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపించింది.ఈ మూవీకి  సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ కావటం.. యూత్ సంచలనం విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ మీద అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దేశ వ్యాప్తంగా పర్యటించిన సందర్భంగా విజయ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినోళ్లంతా నోరెళ్ల బెట్టారు. ఒక సౌత్ స్టార్ కు నార్త్ లో ఇంత ఫాలోయింగ్ ఉందా? అని ఆశ్చర్యపోయి.. ఆనందానికి గురైన పరిస్థితి. ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ మూవీ మీద వచ్చిన రివ్యూలతో ఈ సినిమా కలెక్షన్ల మీద ప్రతికూల ప్రభావం పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

రివ్యూలతో పాటు మౌత్ టాక్ పుణ్యమా అని.. ఫస్ట్ షో తర్వాత నుంచే కలెక్షన్ల మీద ప్రభావం కనిపించినట్లుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. 2022లో భారీ అంచనాలు పెట్టుకున్న మూవీల్లో అత్యధికం నిరాశ పర్చినవే కావటం గమనార్హం. దీంతో.. ఈ ఏడాది భారీ అంటే బాంబు లెక్కన బాక్సాఫీస్ దగ్గర పేలటమే అన్న సెంటిమెంట్ వినిపిస్తోంది. అంతేకాదు.. భారీలకు కాస్తంత దూరంగా ఉంటే మంచిదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News