ట్రెండీ టాక్‌: తాత‌కే ద‌గ్గులు నేర్పే బ్యాచ్!

Update: 2019-05-25 01:30 GMT
కాలంతో పాటే మార్పు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ యుగం న‌డుస్తోంది. డిజిట‌ల్ మీడియా రాక‌తో అంతా మారిపోయింది. క్ష‌ణాల్లో ఏ వార్త‌ను అయినా స్మార్ట్ ఫోన్ లో చ‌దివేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల ప్ర‌చార స‌ర‌ళి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడంతా సోష‌ల్ మీడియానే. ట్విట్ట‌ర్.. ఇన్ స్టా.. ఫేస్ బుక్ .. యూట్యూబ్ అంటూ ప్ర‌తిదీ ప్ర‌చారానికి అందుబాటులో ఉన్నాయి. ఎక్క‌డో మారుమూల ప‌ల్లెటూర్లో సినిమా తీసి యూట్యూబ్ లో ప్ర‌చారం చేసుకుంటున్న వాళ్లు ఉన్నారు. ల‌ఘు చిత్రం.. వెబ్ సిరీస్.. టిక్ టాక్ అంటూ ప్ర‌తిదీ ప్ర‌చారానికి ఎంతో సులువు అయిపోయింది. ప్ర‌తిభ‌ను ఎలివేట్ చేసుకోవ‌డం అంతే ఈజీ అయిపోయింది.

అయితే ఈ ప‌రిణామం ఏంటో కొంద‌రికి అస్స‌లు అర్థం కావ‌డం లేదు. గోడ పోస్ట‌ర్ రోజుల నుంచి సినిమాలు తీస్తున్న కొంద‌రు నిర్మాత‌లు అస‌లేంటో ఈ రోజుల్లో ఈ మీడియా ఆర్భాటం.. ప్ర‌చార శైలి? అంటూ న‌సిగేస్తున్నారు. పైగా సినిమాల ప్ర‌చారంలో పిచ్చి ప్ర‌కోపించింద‌న్న‌ది వీళ్ల అభిప్రాయం. మోష‌న్ పోస్ట‌ర్ .. డిజిట‌ల్ పోస్ట‌ర్... సింగిల్ రిలీజెస్.. ప్రీరిలీజ్.. ట్రైల‌ర్ లాంచ్ అంటూ ఒక్కో దానికి ఒక్కో ఈవెంట్ చేస్తుంటే ఇదంతా ఎంతో వింత‌గా కొత్త‌గా ఉంద‌ని ఐదు ద‌శాబ్ధాల పాటు తెలుగు సినీరంగంలో నిర్మాత‌గా కొన‌సాగి 50 సినిమాల‌కు చేరువ‌లో ఉన్న ఓ సీనియ‌ర్ నిర్మాత వాపోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ఒక‌ప్ప‌టి నిర్మాత‌లు మార‌క‌పోవ‌డం వ‌ల్ల‌నా రేసులో వెన‌క‌బ‌డ‌డం చ‌ర్చ‌కొచ్చింది ఆయ‌న మాట‌తో.

ఒక‌ప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆడియో ఫంక్ష‌న్.. రిలీజ్ ప్రెస్ మీట్ మాత్ర‌మే ఉండేవి. రిలీజ్ త‌ర్వాత‌ స‌క్సెస్ మీట్ చేసేవారు. 50 రోజులు.. 100 రోజుల ఫంక్ష‌న్లు ఉండేవి. ఇంకా బాగా ఆడితే సిల్వ‌ర్ జూబ్లీ అంటూ ఘ‌నంగా జ‌రిపేవారు. మొత్తం నాలుగైదు ప్రెస్ మీట్ల‌తో అయిపోయేది. గోడ పోస్ట‌ర్.. టీవీల్లో ట్రైల‌ర్ ప్ర‌క‌ట‌న‌లు త‌ప్పితే ఇంకేవీ ఉండేవి కావు. అస‌లు ఇవేవీ అఖ్క‌ర్లేకుండానే సోష‌ల్ మీడియాలో బోలెడంత ప్ర‌చారం చేసేసుకుంటున్నారు నేటిత‌రం నిర్మాత‌లు. ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్.. యూట్యూబ్ మీడియా అంటూ ఎవ‌రికి వారు సొంత మీడియాలు పెట్టుకుని ప్ర‌చ‌రం చేసేసుకుంటున్నారు. ఇక డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ లాంటి బ‌డా సంస్థ‌లు సొంతంగా ఓ మీడియాని పెట్టుకుని ఎంతో యాక్టివ్ గా ఉంది. సోష‌ల్ మీడియాలో జెట్ స్పీడ్ తో సినిమాకి ప్ర‌చారం చేసుకోవ‌డంలో ఇత‌రుల‌తో పోలిస్తే దూకుడుమీద ఉంది. అయితే దాన‌య్య .. అల్లు అర‌వింద్.. దిల్ రాజు త‌ర‌హాలో స్పీడు లేని ఎంద‌రో క్లాసిక్ నిర్మాత‌ల‌కు మాత్రం ఇదంతా ఓ ఫ‌జిల్ లా ఉంది. అస‌లే కాస్ట్ ఫెయిల్యూర్ .. అన్ లిమిటెడ్ బ‌డ్జెట్ల దెబ్బ‌కు క్లాసిక్ నిర్మాత‌లంతా చాప చుట్టుకుని ఎటో పోయారు. కాలంతో మైండ్ సెట్ మార్చుకుని నేటి ట్రెండ్ ని అనుస‌రించి పెను పోక‌డ‌ల్ని అర్థం చేసుకున్న నిర్మాత‌లు మాత్ర‌మే మనుగ‌డ సాగించ‌గ‌లుగుతున్నారు.

అయినా కొత్త నీరు వ‌చ్చి పాత నీరు పోతుంటుంది. అలానే ఇప్పుడొస్తున్న యంగ్ ఫిలింమేక‌ర్స్ ప్ర‌మోష‌న్ లో రాటు తేలిన తర్వాత‌నే బ‌రిలో దిగుతున్నారు. తాత‌కే ద‌గ్గులు నేర్పే బ్యాచ్ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్- యూసఫ్ గూడ‌లో బోలెడుమంది.


Tags:    

Similar News