మీడియా పై సినీ నిర్మాత బ‌షీద్ ఫైరింగ్

Update: 2019-12-28 10:08 GMT
ఇష్టానుసారం లేని పోని వార్తలు రాసేస్తే కోర్టు కెళ‌తాను అంటూ మండిపడ్డారు నిర్మాత ఎస్‌.కే బ‌షీద్. ఇటీవ‌ల త‌న‌పై లేనిపోని క‌థ‌నాలు రాసిన పత్రికలన్నింటి పైనా కేసులు వేస్తున్నానంటూ హెచ్చ‌రించారు. అంతేకాదు.. త‌న ఆస్తుల గురించి.. వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి క‌థ‌నాలు రాసిన స‌ద‌రు ప‌త్రిక‌ల్ని పేర్లు పెట్టి మ‌రీ హెచ్చ‌రించారు. అలాగే నేనేమీ పవన్ కళ్యాణ్‌ ని కాదు ఎవరెన్ని మాటలు అన్నా చూస్తూ కూర్చోవడానికి.. నోరు మూసుకుని ఉండటానికి.. అందరినీ హైకోర్టు కు లాగేస్తానంటూ వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌న‌మైంది.

హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియా స‌మావేశం లో మాట్లాడారు. త‌న‌పై అస‌త్య క‌థ‌నాలు అల్లార‌ని ఖండించారు. ``నేను ప్రజల నుంచి సొమ్ము తీసుకుని వారిని బురిడీ కొట్టించానని.. నా ఒక్క‌డికీ పాతిక బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని.. కోట్లు సంపాదించాన‌ని రాసారు. ఇవన్నీ ఈనాడు- సాక్షి-డెక్కన్ క్రానికల్ పత్రికలు ప్ర‌చురించాయి. నా గురించి ఎవరెవరు ఏం రాశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. వీరందరి పై నేను హైకోర్టు లో కేసు వేస్తున్నాను`` అని తీవ్రం గా హెచ్చ‌రించారు.

ఏదన్నా రాస్తున్నప్పుడు నిజా నిజాలు తెలుసుకోకుండా రాసేస్తారా..? నేనేమీ పవన్ కళ్యాణ్ ని కాదు!! అని వ్యాఖ్యానించారు. మీరు రాసేవి నిజాలు అయితే ఈపాటికే నన్ను అరెస్ట్ చేయాలి కదా. కానీ తెలంగాణ పోలీసులు దేవుళ్లు. వాళ్లు నా పై వస్తున్నవన్నీ నిజమా కాదా అని తెలుసుకుని నాకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. 2005 నుంచి ప్రజల నుంచి సొమ్ము తీసుకుంటున్నట్లు సాక్షి వాళ్లు రాశారు. సాక్షి వచ్చిందే 2010లో. మా చేత ఛానెల్‌కు ప్రచారం కల్పించుకుని మా గురించే ఇలాంటివి రాస్తారా? అంటూ ఆ పత్రిక‌ పై తీవ్రంగా విమ‌ర్శించారు. ఇలాంటి చెడు ప్ర‌చారం తో నా బిజినెస్ దెబ్బ తినదా? కుటుంబంపై ప్రభావం చూపదా? నేను ముందు రామోజీ రావు పై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా.. అని అన్నారు.

ఐదు సినిమాలు తీసినా ఇప్ప‌టి వ‌ర‌కూ శాటిలైట్ రైట్స్ కూడా అమ్మ లేదు.. ఎవ‌రి నుంచీ డ‌బ్బు తీసుకునే అల‌వాటు లేదు! అని బ‌షీద్ అన్నారు. ఛాన్సులిప్పిస్తాన‌ని అమ్మాయిల నుంచి డ‌బ్బు తీసుకున్నాన‌ని రాశారు. లేనిపోని వార్త‌లివి. నా పై రాసిన వాళ్లంతా కోర్టు లో స‌మాధానం చెప్పాలి! అంటూ హెచ్చ‌రించారు.


Tags:    

Similar News