`ఎఫ్ ఐ ఆర్‌` ట్రైల‌ర్ : ఇన్నోసెంట్‌ దేశ‌ ద్రోహిగా మారితే..

Update: 2022-02-03 12:31 GMT
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ న‌టించిన చిత్రం `ఎఫ్ ఐ ఆర్‌. మ‌ను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్, విష్ణు విశాల్ బ్యాన‌ర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఒకేసారి ఈ చిత్రాన్ని త‌మిళ్ తో పాటు తెలుగులోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు హీరో ర‌వితేజ యాడ‌వ్వ‌డంతో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేకింగ్ ప‌రంగానూ.. క‌థా నేప‌థ్యం ప‌రంగా ఈ మూవీ స‌రికొత్త‌గా వుండ‌బోతోంది.    

రెబా మోనికా జాన్‌, మంజిమ మోహ‌న్ హీరోయిన్ లుగా న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన్‌, రైజా విల్స‌న్ న‌టించారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ ని విడుద‌ల చేశారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాట‌లో విష్ణు విశాల్‌, రెబా మోనికా జాన్ ల కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ ని గురువారం చిత్ర బృందం విడుద‌ల చేసింది.  

`టెర్ర‌ర్ పుట్టాలి.. టెర్ర‌రిజ‌మ్ పెర‌గాలి .. ఇందు కోసం నాకు ఓ ఆర్మీ కావాలి.. అంటూ ఓ వ్య‌క్తి చెబుతున్న డైలాగ్ తో  ట్రైల‌ర్ మొద‌లైంది. ఐఎస్ ఐ టెర్రిరిజ‌మ్ నేప‌థ్యం లో ఈ సినిమా సాగ‌నుంది. సాధార‌ణ జీవితం గ‌డుపుతున్న ఇర్ఫాన్ అహ‌మ్మ‌ద్ అనే అమాయ‌క యువ‌కుడి జీవితంలో భ‌యంకర‌మైన ఐఎస్ ఐ ఉగ్ర‌వాది అబూ బ‌క్క‌ర్ అబ్దుల్లా పై జ‌రిగిన ప‌రిశోధ‌న కార‌ణంగా ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి?.. చివ‌రికి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఇన్నోసెంట్ ఇర్ఫాన్ అహ‌మ్మ‌ద్ దేశ ద్రోహిగా ఎందుకు చిత్రించ‌బ‌డ్డాడు? త‌న‌లా మ‌రొక‌రు బ‌లికాకూడ‌ద‌ని త‌ను ఎలాంటి పోరాటం చేశాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించారు. మంజిమ మోహ‌న్ లాయ‌ర్ గానూ.., విష్ణు విశాల్ కు జోడీగా  రెబా మోనికా జాన్ న‌టించింది.  కేవ‌లం అనుమానంతో ఒక‌డి జీవితాన్ని నాశ‌నం చేస్తే ఎవ‌డో ఒక‌డు తిరిగి దెబ్బ‌కొడ‌తాడ‌నే భ‌యం పుట్టాలి.. అంటూ ట్రైల‌ర్ లో విష్ణు విశాల్ చెబుతున్న డైలాగ్ లు సినిమా థీమ్ ఎలా వుంటుంద‌న్న‌ది స్ప‌ష్టం చేస్తున్నాయి. టెర్ర‌రిజ‌మ్ కార‌ణంగా ఓ అమాయ‌కుడు ఎదుర్కొన్న స‌వాళ్ల‌ని ఈ చిత్రంలో చూపించిన తీరు, డైరెక్ట‌ర్ మ‌ను ఆనంద్ సినిమాని తెర‌కెక్కించిన విధానం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ర‌వితేజ ఈ మూవీ టేకింగ్ , హీరో క్యారెక్ట‌రైజేషన్ న‌చ్చ‌డం వ‌ల్లే ఈ సినిమాకు భాగ‌స్వామిగా చేరిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళంలోనూ భారీ విజ‌యాన్ని సాధించ‌డం కాయంగా క‌నిపిస్తోంది.


Full View
Tags:    

Similar News