అన్న‌పూర్ణ స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్‌..?

Update: 2017-11-13 15:26 GMT
ప్ర‌ముఖ ఫిలింస్టూడియో అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. సోమ‌వారం సాయంత్రం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో మ‌నం సినిమాకు సంబంధించిన సెట్టింగ్‌ కు నిప్పు అంటుకుంది. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ ఫిలిం స్టూడియోలో త‌మ తండ్రి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన చివ‌రి చిత్ర‌మైన మ‌నం సెట్‌ ను ఆయ‌న గుర్తుగా అలానే ఉంచేశారు.

సెంటిమెంట్ లో భాగంగా మ‌నం సెట్‌ ను అలానే ఉంచారు. అయితే.. ఈ సెట్‌ కు స‌మీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ ఉంది. ఇది షార్ట్ స‌ర్క్యూట్ కావ‌టం.. నిప్పు ర‌వ్వ‌లు  పెద్ద ఎత్తున వ‌చ్చి సెట్ మీద ఉన్న గ‌డ్డి మీద ప‌డ‌టంతో నిప్పు అంటుంది. సెట్ మీద వేసిన గ‌డ్డి చాలాకాలంగా ఎండిపోయి ఉండ‌టంతో అగ్నికీల‌లు వెనువెంట‌నే వ్యాపించాయి.

బంజార‌ హిల్స్ రోడ్డు నెంబ‌రు 2లో ఉన్న అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం స‌మాచారం తెలిసిన వెంట‌నే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన ఫైర్ ఇంజ‌న్లు స్టూడియోకి చేరుకున్నాయి. అప్ప‌టికే మంట‌లు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అతి క‌ష్ట‌మ్మీద మంట‌ల్ని ఆర్పిన‌ట్లుగా చెబుతున్నారు.

ఫైర్ యాక్సిడెంట్ స‌మాచారం తెలిసిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి సినీన‌టులు నాగార్జున చేరుకున్నారు. తండ్రి గుర్తుగా ఉంచిన సెట్ క‌ళ్ల ముందే కాలిపోవ‌టం తీవ్ర మ‌నోవ్య‌ధ‌కు గురైన‌ట్లు చెబుతున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం గురించి స‌మాచారం తెలిసిన వెంట‌నే మీడియా సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకున్నా.. ఎవ‌రినీ లోప‌ల‌కు అనుమ‌తించ‌లేదు. బాగా ప‌రిచ‌యం ఉన్న కొంద‌రు లోప‌లికి వెళ్లారు. వీరు తీసిన విజువ‌ల్స్ చాన‌ల్స్ లో టెలికాస్ట్ అయ్యాయి. ఎప్పుడైతే నాగార్జున ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారో అప్ప‌టినుంచి ఫోటోలు.. వీడియోలు తీయ‌టంపై నియంత్రించిన‌ట్లుగా తెలుస్తోంది. స్టూడియోలో లైట్లు ఆర్పించేసిన‌ట్లుగా స‌మాచారం. దీంతో.. విజువ‌ల్స్‌.. ఫోటోలు తీయ‌టానికి లోప‌ల‌కు వెళ్లిన మీడియా సిబ్బంది ఏం చేయాలో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్లు చెబుతున్నారు. 
Tags:    

Similar News