ఆ పాత్ర కోసం 80 శాతం చూపును కోల్పోయి షూట్ చేశాడట

Update: 2021-10-06 08:30 GMT
సినిమాను సహజంగా తీయటం కోసం నటీనటులు.. దర్శక నిర్మాతలు భారీ సాహసాలకు తెర తీస్తున్నారు. తాజాగా అలాంటి సాహసం ఒకటి బయటకు వచ్చింది. బాలీవుడ్ హీరోల్లో రోటీన్ కు భిన్నంగా ఉండే హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. మిగిలిన వారి సినిమాలకు భిన్నంగా తన సినిమాలు ఉండేలా చూడటంతో పాటు.. తన హీరోయిజం తెర మీద ఎలివేట్ అయ్యే దాని కంటే.. కథ హీరోగా కనిపించేందుకు అవకాశం ఇవ్వటం ద్వారా బోలెడంత మంది అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు.

తాను చేసే సినిమాల్లో వైవిధ్యం కోసం తపిస్తుంటారు. అలా కొంతకాలం క్రితం నటించిన మూవీ ‘అంధాధున్’. మూస సినిమాలకు బ్రేక్ చెప్పేలా ఉండే ఈ మూవీ ఆయుష్మాన్ స్టార్ డమ్ ను ఎక్కడికో తీసుకెళ్లటమే కాదు.. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అంధుడిగా కనిపించేందుకు అతగాడు తీసుకున్న జాగ్రత్తలు..చేసిన సాహసం తెలిస్తే ఉత్తినే సక్సెస్ రాదన్న నిజం అర్థమవుతుంది.

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బడ్జెట్ 32 కోట్ల రూపాయిలు అయితే.. ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.456 కోట్లను వసూలు చేసింది. అంతేనా.. ఎన్నో భాషల్లో రీమేక్ కావటమే కాదు.. మరిన్ని భాషల్లో రీమేక్ అయ్యే అవకాశం ఉంది కూడా. ఈ సినిమాలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించేందుకు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాలో నిజమైన అంధుడిలా కనిపించటం కోసం చాలానే కసరత్తు చేశారు. ఆయుష్మాన్ బ్లైండ్ లుక్ కోసం ప్రత్యేకంగా సెక్లెరల్ లెన్స్ ను తీసుకొచ్చారు. మార్కెట్లో ఇవి లభించవు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించారు. రెండు కళ్లకు వాడే ఈ లెన్స్ ధర ఏకంగా రూ.6లక్షలు కావటం గమనార్హం. వీటిని ధరించిన తర్వాత 80 శాతం చూపు కోల్పోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. దీనికి తోడు బ్లాక్ గ్లాసెస్ ధరించటంతో 90 శాతం చూపు కనిపించదు. అలాంటి అనుభవాన్ని స్వయంగా పొందుతూ ఆయుష్మాన్ ఈ మూవీ చేశారు.

అంతేకాదు.. ఈ సినిమా కోసం చూపు కోల్పోయిన ఒక పియానిస్ట్ దగ్గర ట్రైనింగ్ పొందాడు. సినిమాలో కీలకమైన అంధుడైన పియానిస్ట్ గా సహజంగా కనిపించేందుకు వీలుగా.. ఐ మాస్క్ ధరించి మరీ నేర్చుకున్నాడు. అంతేకాదు.. తన పనులన్ని వ్యక్తిగతంగా కూడా  ఐమాస్క్ ధరించే చేసుకునేవాడట... ఇదంతా తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవటం కోసం చేసిన కసరత్తుగా చెప్పాలి. ఇంత కష్టానికి ఫలితంగా అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆయుష్మాన్.
Tags:    

Similar News