రియలిస్టిక్ యాక్షన్ ని ఇష్టపడే వారి కోసం.. 'ఆహా' తీసుకొస్తున్న 'కాలా'

Update: 2021-05-25 13:30 GMT
వైవిధ్యమైన సినిమాలను, కంటెంట్ బేస్డ్ చిత్రాలని ప్రేక్షకులకు అందించడంలో మలయాళ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. సినిమా తీయడానికి బలమైన స్టోరీ, భారీ తారాగణం అవసరం లేదని.. ఓ చిన్న స్టోరీ లైన్ తో ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచగలవమని అనేక సందర్భాలలో నిరూపించారు. ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ''కాలా'' కూడా ఈ కోవకే చెందుతుంది.

మలయాళ వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''కాలా''. వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు రోహిత్ వి. ఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక జంతువు కోసం కథానాయకుడు - ప్రతినాయకుడు మధ్య జరిగే రివేంజ్ డ్రామానే ఈ సినిమా. స్టోరీ లైన్ చెప్పడానికి సింపుల్ గా ఉన్నా.. మనుషులకు జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని రియలిస్టిక్ యాక్షన్ తో చూపించారు.

'కాలా' సినిమా మొత్తం ఒక రోజులో జరుగుతుంది. అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో స్టార్ట్ అయిన యాక్షన్.. అదే అడవిలో ముగుస్తుంది. ఇగో - హింస - ప్రతీకారం అనే అంశాలతో జంతువు కోసం జంతువులాగా మారి మనుషులు క్రూరంగా కొట్టుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్ - రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాలు మరియు అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. అందుకే 'కాలా' సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.

టోవినో - సుమేష్ మూర్ ఈ చిత్రంలో తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో టోవినో థామస్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఇక ఇతర కీలక పాత్రలలో నటించిన లాల్ - దివ్య పిళ్ళై తమ పరిధి మేరకు మెప్పించారు. అయితే ఇప్పుడు 'కాలా' చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో జూన్ 4 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. 'ఆహా' లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ 'కాలా' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News