'పుష్ప' టీమ్ కి తప్పని అడవుల కష్టాలు...?

Update: 2020-07-07 06:15 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. కాగా ఈ సినిమా షూటింగ్ కి ఆదిలోనే కరోనా బ్రేక్స్ వేసింది. కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన 'పుష్ప' టీమ్ కి ఇప్పుడు అడవుల కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 85 శాతం అడవుల్లోనే తీయాల్సి ఉంటుందట. దీని కోసం ముందుగా చిత్తూర్ ఫారెస్ట్ ఏరియాలో ప్లాన్ చేశారట. అయితే తెలంగాణలో ఉన్న అడవుల్లోకి మారుస్తున్నారనే టాక్ వినిపించింది. ఐతే సుకుమార్ విజువలైజేషన్ కి తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ సరిపోక పోవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఓ బ్యాడ్ సెంటిమెంట్ వల్ల 'పుష్ప' సినిమా గురించి మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారట. అదేంటంటే మెగా హీరోలకి పెద్దగా అడవులు కలిసి రావని కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఒక్కప్పుడు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సూపర్ హిట్ చిత్రాలను అందించిన మెగాస్టార్ చిరంజీవి.. చివరగా అడవుల నేపథ్యంలో రూపొందిన రెండు సినిమాలు అట్టర్ ప్లాప్స్ అయ్యాయి. అవే 'మృగ రాజు' 'అంజి'. ఆ తరువాత చిరుతో సహా ఏ మెగా హీరో ఎక్కువగా అడివి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా మొత్తం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ బ్యాడ్ సెంటిమెంట్ బాగా ప్రచారం అవుతుంది. దీంతో బన్నీ ఇప్పుడు కాస్త రిస్క్ చేస్తున్నాడేమో అని మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు.

కాగా పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప' సినిమాని తెలుగుతో పాటు త‌మిళ‌ మ‌ల‌యాళ‌ క‌న్న‌డ‌ హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. బన్నీ - సుక్కు కలయికలో రాబోతున్న మూడో సినిమా కావడంతో 'పుష్ప' పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
Tags:    

Similar News