మూవీ రివ్యూ: ‘గ్యాంగ్’

Update: 2018-01-12 16:03 GMT
చిత్రం : ‘గ్యాంగ్’

నటీనటులు: సూర్య - కీర్తి సురేష్ - రమ్యకృష్ణ - కార్తీక్ - సురేష్ మీనన్ - కలైఅరసన్ - ఆర్జే బాలాజీ - సెంథిల్ - శివశంకర్ - ఆనంద్ రాజ్ - తంబి రామయ్య తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: దినేశ్ కృష్ణన్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
మూల కథ: నీరజ్ పాండే
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: విఘ్నేష్ శివన్

రజినీకాంత్.. కమల్ హాసన్ ల తర్వాత తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్య. అతడి ప్రతి సినిమా తెలుగులోనూ పెద్ద స్థాయిలో విడుదలవుతుంది. ఇప్పుడు సూర్య నటించిన ‘తానే సేంద కూట్టం’ తెలుగు వెర్షన్ ‘గ్యాంగ్’ సంక్రాంతి సీజన్లో మన పెద్ద హీరోల సినిమాలకు పోటీగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తిలక్ (సూర్య) మంచి చదువు చదువుకుని తన తండ్రి ఫ్యూన్ గా పని చేసే సీబీఐ ఆఫీసులో అధికారిగా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఉంటాడు. ఐతే అన్ని అర్హతలున్నా అతడికి ఉద్యోగం రాదు. ఉన్నతాధికారులు తిలక్ కు అన్యాయం చేస్తారు. తిలక్ లాగే అతడి స్నేహితులు కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఇక లాభం లేదని ఒక బృందాన్ని సిద్ధం చేసుకున్న తిలక్.. సీబీఐ అధికారి అవతారమెత్తి తెలివిగా దోపిడీలు చేయడం మొదలుపెడతాడు. ఈ బృందానికి అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియక సీబీఐ తల పట్టుకుంటున్న సమయంలో శివశంకర్ (కార్తీక్) అనే అధికారి రంగంలోకి దిగుతాడు. మరి అతను ఈ గ్యాంగుని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచించాడు.. తిలక్ బృందం వాటిని ఎలా ఎదుర్కొంది. అంతిమంగా ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

దక్షిణాదిన ఈ మధ్య రీమేక్ సినిమాలు చాలా వరకు బోల్తా కొట్టేస్తున్నాయి. గతంతో పోలిస్తే కమ్యూనికేషన్.. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో ఏదైనా ఒక భాషలో ఒక సినిమా హిట్టయితే వేరే భాషల వాళ్లూ చూసేస్తున్నారు. చూడకపోయినా.. రీమేక్ అనగానే ఆ సినిమాకు సంబంధించిన సమాచారమంతా ముందే తెలుసుకుంటున్నారు. దీంతో రీమేక్ సినిమా అనగానే ఎగ్జైట్మెంట్ పోతోంది. ఒక సినిమాను ఉన్నదున్నట్లుగా దించేస్తే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అలాగని మార్పులు చేర్పులు చేస్తే మాతృకను చెడగొట్టిన భావన కలుగుతోంది. దీంతో రీమేక్ తీయడం అన్నది క్రమ క్రమంగా సవాలుగా మారిపోతోంది. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది దర్శకులు మరో భాషలో బాగా ఆడిన సినిమాలోంచి మూల కథను తీసుకుని.. దాన్ని స్థానిక పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకుని.. తమదైన ట్రీట్మెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కొన్నేళ్ల కిందట తెలుగులో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఒక ఉదాహరణ. ‘గ్యాంగ్’ ఆ స్థాయి సినిమా కాదు.. కానీ ఆ కోవలోనిదే.

హిందీలో కొన్నేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘స్పెషల్ చబ్బీస్’కు రీమేక్ ‘గ్యాంగ్’. ఐతే మాతృకను కాపీ పేస్ట్ చేయకుండా ఆ కథను సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా అడాప్ట్ చేసుకున్నాడు విఘ్నేష్. ‘స్పెషల్ చబ్బీస్’ పూర్తి సీరియస్ గా సాగితే.. ‘గ్యాంగ్’ మాత్రం ఎంటర్టైన్మెంట్ బేస్ మీద నడుస్తుంది. ఈ క్రమంలో ఒరిజినల్లోని బిగి.. తీవ్రత.. థ్రిల్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే కానీ.. అదే సమయంలో ‘గ్యాంగ్’లోని కొత్త ఆకర్షణలు కూడా మెప్పిస్తాయి. హిందీలో ‘స్పెషల్ చబ్బీస్’ చూసిన వాళ్లు కూడా కొంచెం ఆసక్తితో చూసేలా మార్పులు చేర్పులతో ‘గ్యాంగ్’ను నడిపించాడు విఘ్నేష్. మూల కథను తీసుకుని.. అందులోని కీలకమైన సన్నివేశాల్ని కూడా ఇక్కడ వాడుకుంటూ.. తనదైన సెటప్ జోడించాడతను. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 80ల నాటి నిరుద్యోగ సమస్య తీవ్రతను బలంగా చెబుతూ.. ఆ నేపథ్యాన్ని మూల కథకు చక్కగా ఉపయోగించుకున్న వైనం. విఘ్నేష్ చేసిన ఈ కీలక మార్పు పని చేసింది.

ఇక పోలికలు అవీ పక్కన పెట్టి ‘గ్యాంగ్’ విశేషాల్లోకి వెళ్తే.. 80వ దశకంలో సీబీఐ ఆఫీసర్ల వేషాల్లో వచ్చి బడా బాబుల్ని దోచుకున్న హై ప్రొఫైల్ దొంగలకు సంబంధించి వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అప్పటి వాతావరణాన్ని చక్కగా చూపిస్తూ.. ఆ నేపథ్యంలో కథను ఆసక్తికరంగా నడపడంలో ‘గ్యాంగ్’ టీం విజయవంతమైంది. కొన్ని చోట్ల లాజిక్ కు కొంచెం దూరంగా వెళ్తున్న భావన కలిగించినప్పటికీ.. ఈ గ్యాంగ్ మోసాలు చేసే తీరును ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా వీళ్ల తొలి మిషనే భలే ఫన్నీగా సాగుతుంది. ఆ ఎపిసోడ్ కంటే ముందు సినిమాను మొదలుపెట్టిన తీరు.. హీరో మోసగాడిగా మారడానికి దారి తీసే పరిస్థితుల్ని కన్విన్సింగ్ గా చూపించడంలోనూ దర్శకుడు విజయవంతమయ్యాడు.

చాలా వరకు సరదాగా సాగే ఈ సినిమాలో ఉన్న ఒక్క సీరియస్ ఎపిసోడ్ కూడా బాగానే పండింది. హీరో స్నేహితుడు ప్రాణాలు తీసుకునే సీన్.. దానికి దారి తీసే పరిస్థితులు.. ఆ సెటప్ అంతా కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ ఎపిసోడ్ పూర్తిగా కొత్తది.. మాతృకలో లేనిది. ఐతే ప్రథమార్ధం సాగినంత వేగంగా.. ద్వితీయార్ధం నడవకపోవడం ‘గ్యాంగ్’కు మైనస్. ద్వితీయార్ధంలో సాగతీత కనిపిస్తుంది. కొన్ని చోట్ల సన్నివేశాలు ఇల్లాజికల్ గా సాగుతాయి. హీరో గ్యాంగ్ సీబీఐ పేరుతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చి మరీ ఇంటర్వ్యూలు చేసి టీంను రెడీ చేసుకోవడం నమ్మశక్యంగా అనిపించవు. అలాగే దోపిడీ చేస్తున్నది ఎవరో తెలిసినా.. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయుల్లా ఉండటం.. హీరో టీంలో కూడా ఏ ఆందోళనా లేకపోవడమూ ఆశ్చర్యం కలిగిస్తుంది.

హీరో గ్యాంగ్ చేసే దోపిడీలు మరికొన్ని చూపించాల్సిందని కూడా అనిపిస్తుంది. ఒక దశ దాటాక ఈ విషయంలో తీవ్రత తగ్గిపోయింది. పతాక సన్నివేశం.. దానికి ముందు వచ్చే సీన్స్ కొంచెం గందరగోళంగా తయారయ్యాయి. హడావుడిగా సినిమాను ముగించేసిన భావన కలుగుతుంది. మాతృకలో చివర్లో వచ్చే కొసమెరుపును విఘ్నేష్ ఎందుకు విడిచిపెట్టేశాడో అర్థం కాదు మరి. అతను చేసిన మిగతా మార్పులన్నీ ఓకే కానీ.. ఇది మాత్రం అంత ప్రభావవంతంగా లేదు. సినిమాపై మొదటి నుంచి ఉన్న ఇంప్రెషన్ చివరికొచ్చేసరికి తగ్గినప్పటికీ.. ఓవరాల్ గా ‘గ్యాంగ్’ ఓకే అనిపిస్తుంది. ఐతే కమర్షియల్ అంశాలు తక్కువగా ఉన్న ఈ  క్లాస్ థ్రిల్లర్ ను మాస్ ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారన్నది సందేహమే.

నటీనటులు:

సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాకు అతి పెద్ద ఆకర్షణ అతనే. తిలక్ పాత్రను ఆత్మవిశ్వాసంతో చేసుకుపోయాడతను. సొంత డబ్బింగ్ వల్ల సూర్య ఓవరాల్ పెర్ఫామెన్స్ మరింత ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. ఇటు కామెడీ సీన్లలో.. అటు సీరియస్ సన్నివేశాల్లో సమర్థంగా నటిస్తూ సూర్య మనసు దోచుకుంటాడు. ఉద్యోగావకాశం కోల్పోయినపుడు.. స్నేహితుడిని కోల్పోయినపుడు సూర్య పెర్ఫామెన్స్ అతడెంత మంచి నటుడో తెలియజేస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర ఆరంభం బాగుంది కానీ.. తర్వాత తేలిపోయింది. ఆమె లుక్ బాగుంది. రమ్యకృష్ణ పాత్ర.. నటన సినిమాకు మరో బలం. హిందీలో అనుపమ్ ఖేర్ చేసిన పాత్రను ఆమె ఇక్కడ చాలా బాగా చేసింది. కార్తీక్ పాత్రకు మొదట్లో బిల్డప్ ఇచ్చి.. ఆ తర్వాత గాలి తీసేశారు. అతడి నటన ఓకే. రేవతి భర్త సురేష్ మీనన్ బాగా చేశాడు. ఆనంద్ రాజ్.. ఆర్జే బాలాజీ.. సెంథిల్.. శివశంకర్.. వీళ్లందరూ పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

సాంకేతికవర్గం:

‘గ్యాంగ్’కు టెక్నీషియన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు బాగా కలిసొచ్చింది. పాటలు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. వాటి చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. దినేశ్ కృష్ణన్ విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. 80ల నాటి నేపథ్యాన్ని తెరమీద చూపించడంలో అతను.. ఆర్ట్ డైరెక్టర్ చేసిన కృషి తెరమీద కనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. శశాంక్ వెన్నెలకంటి మాటలు ఓకే. దర్శకుడు విఘ్నేష్ శివన్.. రీమేక్ అయినా తనదైన ముద్ర వేశాడు. ‘స్పెషల్ చబ్బీస్’ కథను లోకలైజ్ చేసిన తీరు.. దీన్ని మరింత ఎంటర్టైనింగ్ మలిచిన వైనం ఆకట్టుకుంటాయి. ఐతే ఈ క్రమంలో మాతృకలోని సీరియస్ నెస్ ను అతను కొంచెం తగ్గడించేశాడు. కొన్ని మార్పుల విషయంలో మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకున్నాడు. మొత్తంగా అతడి పనితీరు మెప్పిస్తుంది.

చివరగా: గ్యాంగ్.. కొంచెం థ్రిల్.. కొంచెం ఫన్!

రేటింగ్- 2.75 /5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News