'గంగూబాయి' కొత్త విడుదల తేదీ ఖరారు..!

Update: 2022-01-28 06:30 GMT
sప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''గంగూబాయి కతియావాడి''. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. చివరగా 2022 ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ మూవీ మరో వారం వెనక్కి వెళ్తోంది.

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గంగూబాయి కతియావాడి' చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో 10వ సినిమాగా వస్తున్న 'గంగూబాయి కతియావాడి' ప్రతిష్టాత్మక 72వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడటానికి ఎంపిక చేయబడింది. 2022 ఫిబ్రవరి 10 - 20 వరకు జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్‌ లో వరల్డ్ ప్రీమియర్ గా ఈ మూవీ స్క్రీనింగ్ చేయబడుతుంది.

కాగా, ''గంగుబాయి కథియావాడి'' చిత్రాన్ని పెన్ స్టూడియోస్ - బన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జయంతిలాల్ గడా - సంజయ్ లీలా బన్సాలీ సంయుక్తంగా నిర్మించారు. హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

గంగుబాయి అనే యువతి తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్ గా మారుతుంది.. ఈ క్రమంలో సెక్స్‌ వర్కర్ల హక్కుల కోసం ఎలా పోరాడింది? మేడమ్ ఆఫ్‌ కామతిపురగా ఎలా మారింది? అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో శక్తివంతమైన గంగుబాయి పాత్రలో అలియా భట్ కనిపించనుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అలియా లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో భాగమైన అలియా - అజయ్.. ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి.
Tags:    

Similar News