యూఎస్‌ ఏ టాప్‌ 10లో గోవిందుడు చేరాడు

Update: 2018-08-27 13:07 GMT
ఈమద్య కాలంలో తెలుగు సినిమాకు మరో నైజం ఏరియాగా యూఎస్‌ఏ మారిపోయింది. తెలుగు సినిమాకు అత్యధిక వసూళ్లు వచ్చేది నైజాం ఏరియా నుండి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలకు నైజాం ఏరియా నుండి కంటే యూఎస్‌ ఏ నుండి ఎక్కువగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలు యూఎస్‌ ఏలో మినిమం మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తున్నాయి. ఇక సూపర్‌ హిట్‌ అయితే అంతకు మించి వసూళ్లను నమోదు చేస్తున్నాయి. యూఎస్‌ లో ఇప్పటి వరకు అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. ఏ ఒక్కరికి అందనంత ఎత్తులో దాదాపు 20 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసింది. ఆ తర్వాత స్థానంలో కూడా ‘బాహుబలి’ ఉంది. బాహుబలి మొదటి పార్ట్‌ దాదాపుగా 7 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసింది.

యూఎస్‌ ఏ బాక్సాఫీస్‌ వద్ద తెలుగు స్టార్‌ హీరోల సందడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు యూఎస్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 10 చిత్రాల జాబితాలో తాజాగా ‘గీత గోవిందం’ వచ్చి చేరింది. విజయ్‌ దేవరకొండ - రష్మిక జంటగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించగా - బన్నీ వాసు నిర్మించాడు. రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రం యూఎస్‌ లో తాజాగా 2 మిలియన్‌ డాలర్లను క్రాస్‌ చేసింది. ఈసమయంలోనే టాప్‌ 10లో కూడా జాయిన్‌ అయినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న ఫిదా చిత్రాన్ని 10వ స్థానంలోకి నెట్టేసి 9వ స్థానంలో 2.1 మిలియన్‌ డాలర్లతో నిలిచంది.

ప్రస్తుతం ‘గీత గోవిందం’ దృష్టి మెగా మూవీ ఖైదీ నెం.150 మరియు త్రివిక్రమ్ ‘అఆ’ చిత్రాలపై ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరో వారాంతం గీత గోవిందం ఒక మోస్తరు వసూళ్లను అక్కడ సాధించగలిగితే 8వ స్థానంలో ఉన్న ఖైదీ నెం.150 - 7వ స్థానంలో ఉన్న ‘అఆ’ చిత్రాలను క్రాస్‌ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు చిత్రాలను క్రాస్‌ చేయాలి అంటే గీత గోవిందంకు నాలుగు లక్షల డాలర్లు మాత్రమే అవసరం ఉంది. మంచి టాక్‌ ను దక్కించుకున్న గీత గోవిందం చిత్రం మరో వారం రోజుల్లో ఆ మొత్తంను సాధించి 7 స్థానంకు ఎగబాకడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నెం.3లో 3.51 మిలియన్‌ డాలర్లతో రంగస్థలం ఉండగా - నెం.4లో భరత్‌ అనే నేను చిత్రం 3.44 మిలియన్‌ డాలర్లతో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీమంతుడు(2.89 మిలియన్‌ డాలర్లు) - మహానటి(2.58 మిలియన్‌ డాలర్లు) చిత్రాలు ఉన్నాయి.

Tags:    

Similar News