గీత గోవిందం.. మళ్లీ గెలిచింది

Update: 2018-09-02 11:07 GMT
‘గీత గోవిందం’ విడుదలై మూడు వారాలవుతోంది. కానీ ఇంకా కూడా ఆ సినిమా జోరు తగ్గలేదు. మొదటి వారం అసలా చిత్రానికి పోటీ అన్నదే లేకపోయింది. దీంతో వసూళ్ల మోత మోగిస్తూ వారంలోనే రూ.40 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. తర్వాతి వారంలో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కానీ ఏవి కూడా ‘గీత గోవిందం’ జోరు ముందు నిలవలేకపోయాయి. వాటి ప్రభావం ఎంతమాత్రం దానిపై పడలేదు. సెకండ్ వీక్ లోనూ బాక్సాఫీస్ లీడర్ గా నిలిచిందా చిత్రం. ఈ వారం ‘నర్తనశాల’కు మంచి క్రేజ్ ఉండటం.. ‘పేపర్ బాయ్’ని అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత రిలీజ్ చేయడం.. నయనతార మూవీ ‘కోకో కోకిల’ ఆల్రెడీ తమిళంలో హిట్టయి తెలుగులో రిలీజ్ కావడంతో వీటి ప్రభావం కచ్చితంగా ‘గీత గోవిందం’ మీద ఉంటుందని.. ఈవారం దాని జోరు తగ్గుతుందని అనుకున్నారు.

కానీ అలాంటిదేమీ జరగలేదు. ‘నర్తనశాల’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘పేపర్ బాయ్’కి కూడా టాక్ అంతంతమాత్రంగానే ఉంది. ‘నర్తనశాల’కు సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోతున్నాయి. ‘పేపర్ బాయ్’కి అసలు ఓపెనింగ్సే లేవు. ‘కోకో కోకిల’ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఏమంత బాగా రిసీవ్ చేసుకోవట్లేదు. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వసూళ్లు చూస్తే ట్రేడ్ టాక్ ఏంటన్నది అర్థమైపోతుంది. ఫస్ట్ షోకి సంధ్య 70 ఎంఎం థియేటర్లో ‘గీత గోవిందం’కి రూ.93 వేల దాకా వసూళ్లు వస్తే.. దేవిలో ‘నర్తనశాల’కి రూ.13 వేల పైచిలుకు గ్రాస్ మాత్రమే వచ్చింది. సంధ్య 35 ఎంఎంలో ‘పేపర్ బాయ్’ రూ.22 వేలు రాబట్టాడు. సుదర్శన్ థియేటర్లో ‘కోకో కోకిల’ రూ.18 వేలు తెచ్చుకుంది.  మిగతా మూడు కొత్త సినిమాల వసూళ్లు కలిపితే కూడా రెండు వారాల ముందు రిలీజైన ‘గీత గోవిందం’ మొత్తం వసూళ్లలో 60 శాతమే ఉన్నాయి. దీన్ని బట్టే ‘గీత గోవిందం’ జోరెలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.


Tags:    

Similar News