ప్రొడ్యూస‌ర్స్ కి గుణ పాఠం నేర్పిన ఆ రెండు!

Update: 2022-10-15 15:30 GMT
స్టార్ హీరోల్లో చాలా మంది రీమేక్ లు సేఫ్ అని, స్ట్రెయిట్ క‌థ‌ల‌ని ప‌క్క‌న పెట్టి ప‌ర భాష‌లో హిట్ అనిపించుకున్న సినిమాల‌ని హ్యాపీగా రీమేక్ చేస్తూ హిట్ ల‌ని సొంతం చేసుకున్నారు. అయితే ఇది ఇక‌పై చెల్ల‌దు. రీమేక్ అంతా ఈజీ కాదు. ఒక‌ప్పుడు రీమేక్ సినిమా ఈజీ అని వెంట‌ప‌డిన స్టార్స్ ఇక‌పై ఆచి తూచి అడుగులు వేయాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రీసెంట్ గా విడుద‌లైన రెండు క్రేజీ రీమేక్ లు నిర్మాత‌ల‌కు, అందులో న‌టించిన స్టార్ల‌కు తిరుగులేని గుణ పాఠాన్ని నేర్పాయి.

దీంతో రీమేక్ సినిమాలంటే ప్రొడ్యూస‌ర్ల‌తో పాటు ఇప్ప‌డు హీరోలు కూడా ఆలోచిస్తున్నారు. వివ‌రాల్లోకి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ మూవీ `గాడ్ ఫాద‌ర్‌`. మోహ‌న్ రాజా భారీ మార్పులు చేర్పుల‌తో తెర‌కెక్కించిన ఈ మూవీని మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా రీమేక్ చేశారు. అయితే రీసెంట్ గా ద‌స‌రాకు విడుద‌లైన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోతోంది.

కార‌ణం.. ఈ మూవీకి ఒరిజిన‌ల్ అయిన `లూసీఫ‌ర్‌` తెలుగులో ఒటీటీ ప్లాట్ ఫామ్ తో పాటు యూట్యూబ్ లోనూ అందుబాటులో వుంది. ఇప్ప‌టికే 90 శాతం మంది ఈ మూవీని చూసేయ‌డంతో `గాడ్ ఫాద‌ర్‌`ని థియేట‌ర్ల‌లో చూడ‌టానికి పెద్ద‌గా ఎవ‌రూ ఆస‌క్తిని చూపించ‌డం లేదు. ఇదే ఈ మూవీకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. రీమేక్ అంటే ఎక్క‌డా అందు బాటులో లేని సినిమాని రీమేక్ చేస్తే దాన్ని చూడాల‌నే ఆస‌క్తి  ప్రేక్ష‌కుల్లో వుంటుంది.

అలా కాకుండా ఒరిజిన‌ల్ అందుబాటులో వుండ‌గానే దాన్ని రీమేక్ చేస్తే ఇదుగో ఇలాంటి ఫ‌లితాల‌నే ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు వాపోతున్నాయి. ఇక `గాడ్ ఫాద‌ర్‌` ప‌రిస్థితి ఇలా వుంటే హిందీలో రీమేక్ అయిన `విక్ర‌మ్ వేద‌` ప‌రిస్థితి కూడా ఇలాగే వుంది. హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ ల కాంబినేష‌న్ లో రూపొందిన ఈ మూవీని త‌మిళ హిట్ మూవీ `విక్ర‌మ్ వేద‌`కు రీమేక్ గా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించిన ఈ మూవీ బాలీవుడ్ లో ఎలాంటి ఇంపాక్ట్ ని క‌లిగించ‌లేక‌పోయింది.

కార‌ణం `విక్ర‌మ్ వేద‌` త‌మిళ వెర్ష‌న్ ఇప్ప‌టికే ప‌లు ఓటీటీల‌లో హిందీ డ‌బ్బింగ్‌ వెర్ష‌న్ అందుబాటులో వుండ‌ట‌మే. మేక‌ర్స్ తో పాటు హీరోలు భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ రెండు రీమేక్ లు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌క‌పోగా రిక‌వ‌రీ కూడా క‌ష్టంగా మార‌డంతో రీమేక్ ల‌పై ట్రేడ్ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నాయి. ఈ రెండు సినిమాలు రీమేక్ ల విష‌యంలో నిర్మాత‌, హీరోల‌కు భారీ గుణ‌పాఠాన్ని నేర్పాయ‌ని, ఇక‌పై భ‌విష్య‌త్తులో రీమేక్ లు క‌ష్టమేన‌ని అంటున్నారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ తో పాటు ఎలాంటి డిజిట‌ల్ మాధ్య‌మాల్లో ఒరిజిన‌ల్ అనువాద వెర్ష‌న్ అందుబాటులో లేన‌ప్పుడు మాత్ర‌మే రీమేక్ ల‌ని ట‌చ్ చేయాలే కానీ అలా కాకుండా రీమేక్ లు చేస్తే చేతులు కాల్చుకోవ‌డం ఖాయం అని గాడ్ ఫాద‌ర్‌, విక్ర‌మ్ వేద నిరూపించాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News