ఏపీలో ఆగట్లేదు.. ఈసారి సీతమ్మ వంతు.. బెజవాడలో దారుణం

Update: 2021-01-03 07:52 GMT
ఎప్పుడూ లేని రీతిలో ఏపీలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస పెట్టి సాగుతున్న దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం తాజాగా బెజవాడలో చోటు చేసుకుంది. మొన్న రామతీర్థంలో శ్రీరామ చంద్రుడి విగ్రహాన్ని ధ్వంసం చేయగా .. నిన్న రాజమండ్రిలో మరో ఉదంతం చోటు చేసుకుంది. వరుసగా దేవతా మూర్తుల విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న వారెవరు? ఎందుకిలా చేస్తున్నారు? వాటి వెనుకున్న కుట్ర కోణం లెక్కలు తేలక ముందే ఈ రోజు (ఆదివారం) ఉదయం మరో దారుణం బయటకు వచ్చింది.

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహం ధ్వంసమైంది. విగ్రహం పగిలిపోయిన వైనంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పొరపాటున జరిగిందా? ఎవరైనా కావాలనే చేశారా? అన్నది ప్రశ్నగా మారింది.  ప్రాథమిక విచారణలో ఎలుకలు లేదంటే గాలికి విగ్రహం కింద పడి విగ్రహం ధ్వంసమైనట్లుగా సీఐ చెప్పటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీతమ్మ విగ్రహం ధ్వంసమైందన్నసమాచారం అందిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకున్నారు. పూర్తిస్థాయి విచారణ జరపకముందే.. ఫలానా రీతిలో విగ్రహం ధ్వంసం జరిగి ఉంటుందన్న నిర్దారణకు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమేరాలు పరిశీలించి.. అసలేం జరిగిందో చెప్పాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. 
Tags:    

Similar News