గోపీ మోహన్.. ఫిబ్రవరి 30

Update: 2015-12-27 15:30 GMT
కోన వెంకట్ పేరెత్తగానే ఆటోమేటిగ్గా అందరికీ గోపీ మోహన్ గుర్తొచ్చేస్తాడు. కోనతో కలిసి ఇండస్ట్రీని షేక్ చేసే హిట్లిచ్చాడు గోపీ. కోన వెంకట్ తన పాటికి వేరేగానూ సినిమాలు చేసుకుంటుంటాడు కానీ.. గోపీ మాత్రం చాలా వరకు తనతో కలిసే పని చేస్తాడు. ఐతే రచన వరకు కోనతోనే సాగుతున్న గోపీ.. దర్శకుడిగా సొంత కుంపటి పెట్టుకోవడానికి రెండు మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సునీల్ హీరోగా అతడి దర్శకత్వంలో సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు ఎందుకో కార్యరూపం దాల్చలేదు. చాలా మంది రచయితలు రెండు మూడు సినిమాలకు రాయగానే దర్శకత్వం వైపు వెళ్లిపోతున్నారు. కానీ గోపీకి మాత్రం అపార అనుభవం ఉన్నా ఇంకా డైరెక్షన్ ఛాన్స్ రావట్లేదు.

ఈ సంగతే గోపీ దగ్గర ప్రస్తావిస్తే వచ్చే ఏడాది కచ్చితంగా తన దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని చెప్పాడు. ‘‘బాద్ షా తర్వాత నేను కథలు రాయడమే మానేశా. కచ్చితంగా దర్శకత్వంలోకి వెళ్లిపోవాలనుకోవడమే దీనికి కారణం. సునీల్ తో ఎప్పుడో సినిమా మొదలు కావాల్సింది. కానీ సునీల్ గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ల వల్లే ఆ సినిమా మొదలవలేదు. అలా చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంకా గ్యాప్ తీసుకుంటే మంచిది కాదని సౌఖ్యం - డిక్టేటర్ - శౌర్య సినిమాలకు పని చేశా. ఐతే ఇంకొన్ని రోజుల్లోనే నా దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ‘ఫిబ్రవరి 30’ అని ఓ సినిమా రాసుకున్నా. ఎప్పటికైనా దాన్ని తెరపైకి తేవాలన్నది నా కోరిక’’ అని చెప్పాడు గోపీ మోహన్.
Tags:    

Similar News