ఆస్కార్ అంద‌ని ద్రాక్షే అయ్యింది

Update: 2019-12-17 08:11 GMT
ఆస్కార్ అవార్డుల్ని మించిన అవార్డుల్ని మ‌న‌మే ఇవ్వాలి.. మ‌న మైండ్ సెట్ మారాలి. ఆ స్థాయికి ఎద‌గాలి! అని అన్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. మ‌రి ఆయ‌న క‌ల‌లు నిజ‌మ‌య్యేదెపుడు? అస‌లు ఇండియా లెవ‌ల్లో ఆస్కార్ సినిమానే తెర‌కెక్క‌డం లేదా? ఇన్ని ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఎక్క‌డా అంత స్ట‌ఫ్ క‌నిపించ‌డం లేదా?  క‌మ‌ర్షియ‌ల్ హిట్లు త‌ప్ప మ‌న‌వాళ్లు విశ్వ‌జ‌నీన‌మైన .. సార్వ‌జ‌నీన‌మైన సినిమాల్ని తీయ‌డం లేదా? అంటే .. ప్చ్..ఏమో! అని పెద‌వి విరిచేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఈసారి కూడా ఆస్కార్ అవార్డుకు మ‌నం దూర‌మైపోయాం. విదేశీ కేట‌గిరీలో నామినేట్ అయినా.. ఆస్కార్ రేస్ లో టాప్ 10లో నిల‌వ‌డంలో `గ‌ల్లీ బోయ్` చిత్రం విఫ‌ల‌మైంది. ఇండియా బెస్ట్ సినిమాగా స్వ‌దేశీ క‌మిటీ నిర్ణ‌యించి గ‌ల్లీ బోయ్ ని ఆస్కార్ కి ప్ర‌మోట్ చేసినా ఫైన‌ల్ పోటీలో నిల‌వ‌లేక‌పోయింది. 92 సినిమాల్ని స్క్రుటినీ చేస్తే అందులో టాప్ 10కోసం పోటీప‌డిన వాటిలో మ‌న సినిమా లేదు. అన్నీ విదేశీ సినిమాలు ఈసారి ఆస్కార్ కి పోటీప‌డ‌నున్నాయి.

ఇక ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా.. ఆలియా భ‌ట్ క‌థానాయిక‌గా జోయా అక్త‌ర్ తెర‌కెక్కించిన గ‌ల్లీ బోయ్ క‌మ‌ర్షియ‌ల్ గా బంప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌ల్లీ నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగిన ర్యాప‌ర్స్ క‌థ‌తో ఎంతో ఎమోష‌న‌ల్ గా హై స్టాండార్డ్స్ లో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఎప్ప‌టిలానే చిన్న  చూపున‌కు గుర‌య్యామ‌నే చెప్పాలి.

గ‌తం ప‌రిశీలిస్తే.. అశుతోష్ గోవారిక‌ర్ ల‌గాన్ 2001లో ఫైన‌ల్ వ‌ర‌కూ వెళ్లి ఆస్కార్ గెలుచుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అయితే ప్ర‌త్య‌ర్థికి మాత్రం ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇచ్చింది. ద‌శాబ్ధాల క్రితం మ‌ద‌ర్ ఇండియా- స‌లాంబాంబే లాంటి చిత్రాలు ఆస్కార్ టాప్ 10 వ‌ర‌కూ వెళ్లి అటుపై విఫ‌ల‌మ‌య్యాయి. ఇదంతా మ‌న దేశం నుంచి ఆస్కార్ కి వెళ్లిన  సినిమాల చ‌రిత్ర‌. ఇలా అయితే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ డ్రీమ్ నెర‌వేరేదెలా? మ‌న‌మే ఆస్కార్ రేంజు పుర‌స్కారాల్ని అందించే స్థాయికి ఎద‌గాలంటే ఏం చేయాలి. వాళ్లెవ‌రో ఇస్తే తీసుకోవ‌డ‌మేమిటి.. నాన్సెన్స్.
Tags:    

Similar News