మూవీ రివ్యూ: గుంటూరు టాకీస్

Update: 2016-03-05 10:04 GMT
చిత్రం: గుంటూరు టాకీస్

నటీనటులు: నరేష్ - సిద్ధు - రష్మి గౌతమ్ - శ్రద్ధా దాస్ - మహేష్ మంజ్రేకర్ - రాజా రవీంద్ర  - రఘుబాబు - రవిప్రకాష్ - ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
మాటలు: ప్రవీణ్ సత్తారు - సిద్ధు
నిర్మాత: రాజ్ కుమార్
రచన - దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు

ఎల్బీడబ్ల్యూ - రొటీన్ లవ్ స్టోరీ - చందమామ కథలు లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు ప్రవీణ్ సత్తారు. ఐతే ఆ సినిమాలేవీ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. దీంతో ఈసారి రూటు మార్చి.. అడల్ట్ కంటెంట్ బాగా దట్టించి.. ట్రెండీగా ఉండే క్రైమ్ కామెడీ జానర్ లో ‘గుంటూరు టాకీస్’ తెరకెక్కించాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

భార్య ఎవరితోనో లేచిపోతే జబ్బు పడ్డ తల్లి - ఇద్దరు పిల్లల్ని పోషిస్తూ అసహనంతో జీవితాన్ని సాగించే గిరి (నరేష్) - ఓ లేడీ డాన్ నుంచి తప్పించుకుని వచ్చేసి సువర్ణ (రష్మి గౌతమ్) అనే అమ్మాయితో ఎఫైర్ నడుపుతూ లైఫ్ లాగించేస్తున్న హరి (సిద్ధు).. వీళ్లిద్దరూ ఓ మెడికల్ షాపులో పని చేస్తుంటారు. పగలంతా మామూలుగా కనిపించే వీళ్లు రాత్రవ్వగానే దొంగలుగా మారిపోయి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఐతే చాలీ చాలని డబ్బులతో ఇంకెన్నాళ్లు అనుకుంటున్న వీళ్లు.. ఓ రోజు రాత్రి రెండు ఇళ్లలో తలో ఐదు లక్షలు దొంగతనం చేస్తారు. అక్కడి నుంచి వాళ్ల జీవితం మలుపు తిరుగుతుంది. ఓవైపు పోలీసులు - మరోవైపు ఓ డాన్ మనుషులు వాళ్ల వెంట పడటం మొదలుపెడతారు. మరి వీళ్లందరి నుంచి హరి - గిరి ఎలా తప్పించుకున్నారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రవీణ్ సత్తారు ఇంతకుముందు తీసిన సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా వాటిలో మంచి విషయాలు చాలానే కనిపించేవి. కథాకథనాలు కానీ.. పాత్రలు కానీ.. చాలా ప్రత్యేకంగా అనిపించేవి. ఐతే ఆ సినిమాల ఫలితాలు ప్రవీణ్ లో చాలా మార్పు తెచ్చేసినట్లున్నాయి. ఈసారి అసలు కంటెంట్ గురించి పట్టించుకోకుండా కుర్రాళ్లకు కిక్కెక్కించే అంశాల మీద మాత్రమే తన ఫోకస్ అంతా పెట్టాడు. ట్రైలర్లో.. ప్రోమో సాంగ్స్ లో రష్మి గౌతమ్ అలా రెచ్చిపోతుంటే.. అది కేవలం జనాల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నమేనని.. సినిమాలో అసలు కంటెంట్ వేరే ఉంటుందని అనుకున్నారు జనాలు. కానీ ‘గుంటూరు టాకీస్’లో రష్మి అందాల ప్రదర్శన - బూతు డైలాగులు - కాస్తంత కామెడీ తప్పితే.. ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు.

వాట్సాప్ - యూట్యూబుల్లో అడల్ట్ కామెడీ వీడియోలు చాలా వస్తుంటాయి. అందులో టాయిలెట్ లో పాస్ పోసుకుంటున్న ముగ్గురు ఒకరికొకరు సాయపడే వీడియో ఒకటి చాలామంది చూసుంటారు. దాని గురించి ఇక్కడ వివరంగా రాయడానికి స్వీయ నియంత్రణ అడ్డొస్తోంది కానీ.. ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ఆ తరహా సన్నివేశం చూపించడానికి ఎవరికీ ఏమీ అభ్యంతరం లేకపోయింది. కథలో భాగంగా ఆ సన్నివేశం వచ్చిందీ అంటే సరేలే అనుకోవచ్చు. కానీ కల్పించుకుని ఆ సన్నివేశం పెట్టడంలో ప్రవీణ్ ఉద్దేశం ఏంటో మరి.

ఇక మహేష్ మంజ్రేకర్ వాడే బూతుల గురించి.. సినిమాలో మిగతా పాత్రల మాటలు - చేతల గురించి చెప్పడానికి చాలా ఉంది. ఎంత అడల్ట్ సినిమా అని ముద్ర వేయించుకున్నప్పటికీ.. మరీ ఈ స్థాయిలో హద్దులు దాటాల్సిన అవసరమేంటో? హిందీలో ‘ఢిల్లీ బెల్లీ’ తరహా సినిమాల్లో ఇలాంటి బూతులు చూశాం కానీ.. అందులో కంటెంట్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కొట్టుకుపోయాయి. కానీ ‘గుంటూరు టాకీస్’లో అసలు విషయం లోపించడంతో ఈ అంశాలన్నీ దర్శకుడిపై చీప్ అభిప్రాయాన్ని కలిగించాయి. జాతీయ అవార్డు తెచ్చుకున్న సినిమా తర్వాత ప్రవీణ్ ఇలాంటి సినిమా తీశాడేంటి అన్న ఫీలింగ్ కలిగించాయి.

టొరంటినో తరహాలో ‘రా’గా ఉండే అడల్ట్ క్రైమ్ కామెడీ తీసే ప్రయత్నంలో ప్రవీణ్.. మసాలాలు బాగానే నూరాడు కానీ.. కథాకథనాల మీద మాత్రం శ్రద్ధ పెట్టలేదు. నరేష్ - సిద్ధుల పాత్రల వరకు ఓ మోస్తరుగా వినోదం పండించాడు కానీ.. మిగతా పాత్రలన్నీ ఏదో పైపైన రాసుకోవడంతో అవేవీ ఎలివేట్ కాలేదు. క్రైమ్ కామెడీ తరహా సినిమాల్లో ఉండాల్సిన వేగమే ‘గుంటూరు టాకీస్’లో లోపించింది. ప్రథమార్ధమంతా అసలు కథలోకే వెళ్లకుండా సిల్లీగా అనిపించే సన్నివేశాలతో లాగించేశాడు. పైగా సన్నివేశాలన్నీ మరీ నెమ్మదిగా సా...గడంతో సినిమా భారంగా కదులుతుంది.

ఇంటర్వెల్ ముందు ట్విస్టుతో కదలిక వచ్చినప్పటికీ.. ద్వితీయార్ధంలో మళ్లీ కథ పక్కదారి పడుతుంది. హరి - గిరిల దొంగతనానికి సంబంధించి పోలీస్ ఇంటరాగేషన్ తాలూకు సన్నివేశాలు విసిగిస్తాయి. కోటి రూపాయల డబ్బా గురించి కథనం నడపకుండా వీళ్లు చేసిన చిన్న దొంగతనాల చుట్టూ సన్నివేశాల్ని సాగదీయడంతో ప్రేక్షకులు డీవియేట్ అయిపోతారు. అక్కక్కడా జోకులు పేలుతున్నప్పటికీ సన్నివేశాల సాగతీత విసిగిస్తుంది. కథను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.

‘గుంటూరు టాకీస్’ సినిమాకు ట్రంప్ కార్డులాగా ఉపయోగపడిన రష్మి గౌతమ్.. తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశించారో అది ఇచ్చింది. ఆమె అందాల విందు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. శ్రద్ధా దాస్ కూడా బోల్డ్ గా నటించి కుర్రాళ్లకు కాక పుట్టించింది. ఆమె సిద్ధును రేప్ చేసే సన్నివేశాలు ఫన్నీగా అనిపిస్తూనే.. మరీ టూమచ్ అన్న ఫీలింగ్ కూడా కలిగిస్తాయి. అసలే కథాకథనాలు వీక్ అంటే.. పైగా నిడివి రెండున్నర గంటల దాకా ఉండటం సినిమాకు మైనస్. అడల్ట్ కంటెంట్ ను ఎంజాయ్ చేసేవారిని అక్కడక్కడా నవ్వించి.. కవ్వించి.. కొంచెం సంతృప్తి పరుస్తుంది ‘గుంటూరు టాకీస్’. కానీ అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు:

సిద్ధు - నరేష్ ఇద్దరూ బాగా చేశారు. సహజంగా నటించి మెప్పించారు. కంటెంట్ వీక్ అయినా.. వీళ్లిద్దరూ కలిసి సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రష్మి గౌతమ్ తన బాధ్యత తాను నెరవేర్చింది. సువర్ణ - నా సొంతం పాటల్లో రెచ్చిపోయింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ బాగానే చేసింది. మహేష్ మంజ్రేకర్ పాత్ర అనుకున్న స్థాయిలో లేదు. ఫిష్ వెంకట్ తనదైన శైలిలో నవ్వించాడు. రఘుబాబు - రాజారవీంద్ర - గుండు సుదర్శన్ - రవిప్రకాష్ పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘గుంటూరు టాకీస్’ బాగానే అనిపిస్తుంది. శ్రీచరణ్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ జానర్ సినిమాలకు సరిగ్గా సరిపోయేలా భిన్నమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. ఇక రచయిత - దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎప్పట్లాగే రొటీన్ కు భిన్నమైన సినిమానే ట్రై చేశాడు కానీ.. అదనపు ఆకర్షణల మీద పెట్టిన శ్రద్ధ ఇంతకుముందులా కథాకథనాల మీద పెట్టలేదు. స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్. అడల్ట్ క్రైమ్ కామెడీ సినిమాల్ని అనుకరించాడు తప్పితే.. ప్రవీణ్ తనదైన ముద్ర వేయలేకపోయాడు.

చివరగా: ఈ ‘టాకీస్’లో బూతెక్కువ..  విషయం తక్కువ

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News