‘వంగవీటి’ వివాదంలో కొత్త మలుపు

Update: 2016-12-27 11:30 GMT
‘వంగవీటి’ సినిమా వివాదం ఇంతటితో ఆగేలా లేదు. ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. తాను వంగవీటి కథను వక్రీకరించానని.. తప్పు తప్పుగా సినిమా తీశానని అంటున్న వాళ్లు.. ‘అసలైన వంగవీటి’ పేరుతో ఇంకో సినిమా తీసి వాస్తవాలు చూపించవచ్చంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ఎద్దేవాను అవతలి వర్గం సీరియస్ గానే తీసుకున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమ నుంచే ఓ వ్యక్తి ‘వంగవీటి’ అసలు కథేంటో వెండితెరపై ఆవిష్కరిస్తా అంటూ ముందుకొచ్చాడు. అతనెవరో కాదు.. ఫైట్ మాస్టర్ కమ్ విలన్ కమ్ డైరెక్టర్ జీవీ అలియాస్ సుధాకర్ నాయుడు.

‘అసలైన వంగవీటి’ పేరుతో సినిమా తీసుకోండని సవాల్ విసిరిన కొన్ని గంటల్లోనే జీవీ స్పందించాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటి మీద ఇంకో సినిమా వస్తుందని.. అది ఆయన గొప్పదనాన్ని చాటి చెబుతుందని ప్రకటించాడు. దమ్ముంటే ఈ సినిమాను ఆపుకోండి అంటూ జీవీ సవాలు విసరడం విశేషం. మరి అతను సొంతంగా ఈ సినిమా తీయబోతున్నాడా లేక వంగవీటి రంగా మిత్ర మండలి సహకారం ఏమైనా తీసుకుంటున్నాడా అన్నది తెలియాలి. నిజంగా అతను సినిమా తలపెడితే ఆర్థిక సహకారం బాగానే అందే అవకాశాలున్నాయి. మరి ఆ సినిమా కూడా వర్మ ‘వంగవీటి’ లాగా జనాల దృష్టిని ఆకర్షిస్తుందేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News