నిన్నటి కన్నెమనసుల కలల హీరో శ్రీకాంత్: బర్త్ డే స్పెషల్

Update: 2021-03-23 03:42 GMT
తెరపై కనిపించడమంటే తెర ముందు కూర్చున్నంత వీజీ కాదు .. హీరో అనిపించుకోవడమంటే క్యూలైన్లో కొట్లాడి ఫస్టు టికెట్ తెచ్చుకోవడమూ కాదు. హీరో అనిపించుకోవాలంటే అందుకు తగిన రూపం ఉండగానే సరిపోదు, కృషి .. పట్టుదల .. కార్యదీక్ష ఇలాంటివన్నీ కలిసి ఉండాలి. అప్పుడే హీరో కావాలనే కల నిజమవుతుంది. థియేటర్ల ముందు కటౌట్ లు చూసుకోవాలనే ముచ్చట తీరుతుంది. సినిమా ఫీల్డ్ కి సంబంధించి బలమైన ఫ్యామిలీ నేపథ్యం లేకపోతే, సినిమాల్లో రాణించడం కష్టమనే ఒక టాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అందులో నిజం లేదని నిరూపించిన అతికొద్ది మంది హీరోల్లో శ్రీకాంత్ ఒకరు.

శ్రీకాంత్ సింగిల్ గానే కెమెరా ముందుకు వచ్చాడు. 1991లో 'పీపుల్స్ ఎన్ కౌంటర్' సినిమాలో తొలిసారిగా తెరపై కనిపించాడు. ఆ తరువాత నలుగురు కుర్ర హీరోల్లో ఒకడిగా .. నెగెటివ్ షేడ్స్ కలిగిన యంగ్ విలన్ తరహా పాత్రల్లోను  చేశాడు. కుర్రాడు ఎవరో కుదురుగా .. చూడబుల్ గా ఉన్నాడు. హెయిర్ స్టైల్ .. వాకింగ్ స్టైల్ బాగున్నాయని ప్రేక్షకులు అనుకున్నారు. దాంతో సోలో హీరోగా కూడా చాన్సులు ఇవ్వొచ్చని దర్శక నిర్మాతలు అనుకున్నారు. 'ఆమె' లేడీ ఓరియెంటెడ్ మూవీ కనుక, హీరోగా శ్రీకాంత్ కొట్టిన తొలి హిట్ 'తాజ్ మహల్' అనే చెప్పాలి. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా శ్రీకాంత్ ను యూత్ కి బాగా చేరువ చేసింది.

సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున చెలరేగిపోతున్న సమయంలో, హీరోగా శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తనకి కాస్త అటు ఇటుగా బరిలో ఉన్న జగపతిబాబు .. రవితేజ .. జేడీ చక్రవర్తి నుంచి కూడా గట్టిపోటీని ఎదుర్కోవలసి వచ్చింది. అందుకోసం ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకోవలసి వచ్చింది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో పాటు డాన్సులు కూడా బాగా చేస్తాడని అనిపించుకోవలసి వచ్చింది. ఆయన కృషికి అదృష్టం తోడై, 'పెళ్లి సందడి' .. 'వినోదం' .. 'ఎగిరేపావురమా' .. 'ఆహ్వానం' .. 'కన్యాదానం' .. ఇలా వరుస హిట్లు పడిపోయాయి.

'పెళ్లి సందడి' సినిమా శ్రీకాంత్  కెరియర్ గ్రాఫ్ ను అమాంతంగా పైకి లేపేసింది. ఈ సినిమా తరువాత కన్నెపిల్లల బుక్స్ లో ఆయన ఫొటో ఉండటమనేది కంపల్సరీ అయిపోయింది. ఇక కాలేజ్ కుర్రాళ్లు ఆయన హెయిర్ స్టైల్ ను పొలోమంటూ ఫాలో అయ్యారు. శ్రీకాంత్ సినిమాల్లో సాంగ్స్ చాలావరకూ హిట్ .. ఇది కూడా ఆయనకి బాగా కలిసొచ్చిన అంశం. యూత్ లో తనకి గల ఇమేజ్ ను కాపాడుకుంటూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలా తాను ఎంట్రీ ఇచ్చిన దశకంలోనే శ్రీకాంత్ స్టార్ హీరో అయిపోయాడు.

ఒక వైపున సోలో హీరోగా చెలరేగిపోతూనే, మరో వైపున మల్టీ స్టారర్ సినిమాలను కూడా ఆయన ఉత్సాహంగా చేస్తూ వచ్చాడు. శ్రీకాంత్ అంటే ఏవో రెండు ఫైట్లు .. నాలుగు డాన్సులు అని ఆయన అనిపించుకోలేదు. తనలో విలక్షణమైన నటుడు ఉన్నాడు .. సరైన పాత్ర పడితే ఆ నటుడు వీలైనంతవరకూ విజృంభిస్తాడు అనే విషయాన్ని నిరూపించాడు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా 'ఖడ్గం' .. 'ఆపరేషన్ దుర్యోధన' .. 'మహాత్మ' వంటి సినిమాలు కనిపిస్తాయి. చాలా ఫాస్టుగా 100 సినిమాలు పూర్తిచేసిన హీరోగా కూడా ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.

ప్రస్తుతం ఆయన స్టార్ విలన్ పాత్రల్లో మెప్పించే ప్రయత్నాలు చేస్తూనే, తన వారసుడైన రోషన్ ను హీరోగా నిలబెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కొత్తదనం కోసం తండ్రి విలనిజం వైపు వెళుతూ, కొడుకుని హీరోయిజం వైపు నడిపిస్తుండటం విశేషమే. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీకాంత్ కి శుభాకాంక్షలు అందజేస్తూ, ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలనీ .. అవి విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!
Tags:    

Similar News