ఆర్య ఒక‌టైపు సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంకో టైపు

Update: 2015-09-22 22:30 GMT
సాయిధ‌ర‌మ్‌, రెజీన జంట‌గా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌ రాజు నిర్మించిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఈనెల 24 న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సినిమా సంగతుల్ని ఎక్స్‌ క్లూజివ్‌ గా ముచ్చ‌టించారు. ఆ సంగ‌తులివి...

=ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌ టైనర్‌. నా గత సినిమాల్లానే పూర్తి ఎనర్జీతో ఉంటుంది. అయితే ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే పూర్తిగా కొత్తగా ఉంటుంది. కథ ప్రకారం హీరో ఎన్నారై. మెజారిటీ భాగం సినిమా అమెరికాలోనే తెరకెక్కింది. దిల్‌ రాజు నిర్మాత కాకపోయి ఉంటే నేను ఈ సినిమా చేయలేకపోయేవాడినేమో. ఎందుకంటే నా గత సినిమాలన్నీ ఫ్లాపులు. అందువల్ల ఇంత  పెద్ద స్పాన్‌ తో  బడ్జెట్‌ పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారే కాదు. రాజుగారి వల్లే ఇది సాధ్యమైంది. అంతే కాదు ఇలాంటివి హిందీలో ఎక్కువగా వస్తాయి. పూర్తిగా అమెరికా బ్యాక్‌ గ్రౌండ్‌ లో ప్రేమకథలు బాలీవుడ్‌ లోనే వచ్చాయి. ఇప్పుడు తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ పూర్తిగా ఎన్నారై నేపథ్యంలో తెరకెక్కిన సినిమా.

=సాయిధరమ్‌ లో ఓ పెద్ద స్థాయి కమర్షియల్‌ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే అతడిని ఎంపిక చేసుకున్నా. మిరపకాయ్‌ సినిమా టైమ్‌ లోనే ఈ టైటిల్‌ అనుకున్నా. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌ కూడా అప్పుడే పుట్టింది. అలాగే ఈ చిత్రానికి సాయిధరమ్‌ ని ఎంపిక చేసుకోవడాని కారణం రేయ్‌ ట్రైలర్‌. అది చూశాకే ఆ ఎనర్జీ లెవల్స్‌ నా క్యారెక్టర్‌ కి సరిపోతాయనిపించి సాయిధరమ్‌ ని ఎంపిక చేసుకున్నా.

=ఇదో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. కొందరైతే బావగారూ బాగున్నారా? సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ట్రైలర్‌ చూసి కథ అలా ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఓ విషయం గమనించాలి. తెలుగులో కథలన్నీ ఇంచుమించు రిపీటెడ్‌ గా ఉంటాయి. కాకపోతే కథనంలోనే కొత్తదనం చూపిస్తాం. నిజానికి బావగారూ బాగున్నారా కంటే ముందే అల్లుడుగారు ఉంది. మిస్సమ్మ నుంచి ఆ జోనర్‌ లో సినిమాలొస్తున్నాయి. సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ సినిమాలో అందమైన కథ ఉంది. అద్భుతంగా ఉండే కథ అది. నేను ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్లను. అందరికీ అర్థమయ్యే కథనే సినిమాగా తీస్తా. కావాలనే ప్రయోగాల జోలికి వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే నా కథలో కాదు, కథనంలో కొత్తదనం చూపిస్తున్నా. అందరికీ అర్థమయ్యేలా.. ఉంటుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

=యాక్సిడెంట్‌ అయ్యిందా? హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందా? ఒక్క మెసేజ్‌ పెట్టండి. మీకు నేనున్నా అనే తరహా క్యారెక్టరైజేషన్‌. ఇది కాస్త కొత్తదే, వింతైనదే. సాయం కావాలంటే ఎస్‌ ఎంఎస్‌ చేయండి.. అని అడగడం తప్పేం కాదు. ప్రస్తుత సమాజం అంతా గ్లోబలైజేషన్‌ ప్రభావంతో ఉంది. మార్కెట్ లో ప్రతి వస్తువు అమ్మకం కోసమే. ప్రచారవైవిధ్యంతో జనాల్ని ఆకర్షిస్తున్నారు. ఆషాడం సేల్‌ - దసరా సేల్‌ - సంక్రాంతి సేల్‌ అంటూ పండగల్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇందులోంచే సుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌ పుట్టింది. హీరో అమెరికాలో ఒంటరిగా ఉంటాడు. నాకు నేనే మార్కెట్‌ చేసుకోవాలి అనుకుంటాడు. అందుకు ఈ కొత్త పథకాన్ని ఎంచుకుంటాడు. బతకడం తప్పేం కాదు కదా!

=డు ఆర్ డై అనేదేం లేదు. పవన్‌ కల్యాణ్‌ తో గబ్బర్‌ సింగ్‌ కి పనిచేశా. ఆ తర్వాత చాలా మారాను. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత మూడు రోజులకు వెళ్లి కలిశాను. చాలా సింపుల్‌ గా ఇప్పుడేం చేస్తున్నావ్‌. ఏం అప్‌ డేట్‌ అవుతున్నావ్‌? ఏ పుస్తకాలు చదువుతున్నావ్‌? అని అడిగారు. రికార్డుల గురించి.. సినిమా గురించి అస్సలు ప్రశ్నించనేలేదు. అది నన్ను ఎంతో ఇన్‌ స్పయిర్‌ చేసింది. నేను పరాజయాలకు కుంగిపోను. నేర్చుకుంటానంతే. పర్వతం చేరుకునే ప్రతి సెకను ఆస్వాధించడం అలవాటు పడ్డా. వైరాగ్యం కాదు వేదాంతం ఇది. నిజానికి మిరపకాయ్‌ సినిమాని డు ఆర్‌ డై అనుకునే చేశాను. అప్పటి పరిస్థితి అలాంటిది. పూరి జగన్నాథ్‌ నేనింతే సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఈ సినిమా హిట్‌ తర్వాత సినిమా తీయనా ఏంటి? ఈ సినిమా ఫ్లాపయితే సినిమా తీయనా ఏంటి? అనే డైలాగ్‌ ఉంది. నేను అంతే ఫ్లాపొచ్చినా, హిట్టొచ్చినా సినిమాలు తీస్తూనే ఉంటా. నేను ఇక్కడికి వచ్చింది సినిమాలు తీయడానికి. దర్శకత్వం వహించడానికి. ఆ పనిలోనే ఉంటానెప్పుడూ. దానికి జయాపజయాలతో పనిలేదు.

=సాయిధరమ్‌ పెద్ద స్పాన్‌ ఉన్న హీరో. అతడి ఎనర్జీ - నటన - డ్యాన్సులు - ఫైట్స్‌ అన్నీ సుబ్రహ్మణ్యం చిత్రంలో బాగా చూపించాం. ఛాయాగ్రాహకుడు రామ్‌ ప్రసాద్‌ పనితనం ప్రధాన అస్సెట్‌. సాయిధరమ్‌ లో చిరంజీవి - పవన్‌ పోలికలు కనిపిస్తాయని అభిమానులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టే కొన్ని యాంగిల్స్‌ లో అలాంటి షాట్స్‌ చూపించాం.

=సాయిధరమ్‌ క్యారెక్టర్‌ అతడు నటించిన మునుపటి సినిమాల కంటే ఎనర్జిటిక్‌ గా ఉంటుంది. ఆర్య - ఇడియట్‌ - పోకిరి ఇవన్నీ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్స్‌. వాటి స్టయిల్‌ వాటికి ఉంది. ఇప్పుడు నేనో కొత్త స్టయిల్‌ తో సుబ్రహ్మణ్యం క్యారెక్టరైజేషన్‌ డిజైన్‌ చేసుకున్నా. ఆర్య ఓ టైపు - సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంకోటైపు - ఇడియ‌ట్ మ‌రో టైపు.

=సుబ్రహ్మణ్యం నాయికగా మొదట రెజీనాని అనుకోలేదు. ఓ పెద్ద స్టార్‌ డమ్‌ ఉన్న హీరోయిన్‌ కావాలనుకున్నా. పోస్టర్‌ వేస్తే వీళ్లు కొట్టేస్తారు.. అని జనాలు మాట్లాడుకోవాలి. అందుకు తగ్గట్టే నాయిక కూడా ఉండాలనుకున్నా. పెద్ద హీరోయిన్‌ ని ఎంపిక చేసుకోవాలనుకున్నా. అయితే పవర్‌ సినిమా చూశాక రెజీన నటన నచ్చింది. హీరోయిన్‌ కి కథలో స్కోప్‌ ఎక్కువ. నా సినిమాల్లో హీరోయిన్‌ అంటే పాటకి ముందు వచ్చి సాంగేసుకుని వెళ్లిపోతుంది. అలా కాకుండా ఈసారి నాయిక చుట్టూనే కథ తిరుగుతుంది. అమ్మాయి కథలో అబ్బాయి ఎంటరవుతాడు. సీత అనే క్యారెక్టర్‌ కి నటించే స్కోప్‌ చాలా ఎక్కువ ఉంది. రెజీన తెలుగు నేర్చుకుని తెలుగమ్మాయిలా మాట్లాడేస్తోంది. సెట్స్‌ లోనూ తెలుగులో చక్కగా మాట్లాడింది. సాయిధరమ్‌ తో పోటీపడి మరీ నటించింది.
Tags:    

Similar News