షాక్‌ కు బాలుగారి సాయం గుర్తు చేసుకున్న డైరెక్టర్‌

Update: 2021-06-06 03:30 GMT
ప్రముఖ దివంగత గాయకుడు.. గాన గంధర్వుడు ఎస్వీ బాలసుబ్రమణ్యం మొదటి జయంతి సందర్బంగా వర్చువల్‌ గా పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రోజంతా కూడా సినీ ప్రముఖులతో బాల సుబ్రమణ్యం గురించిన విషయాలను చర్చించారు. ప్రముఖ న్యూస్ ఛానెల్‌ ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చింది. ఈ సందర్బంగా పలువురు బాలు గారితో తమకు ఉన్న అనుబంధంను గురించి చర్చించారు. బాలు గురించి దర్శకుడు హరీష్ శంకర్‌ మాట్లాడుతూ తన మొదటి సినిమా అనుభవంను గుర్తు చేసుకున్నాడు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తన షాక్ సినిమా కు మధురం మధురం అనే పాటను బాలు గారు పాడారు. ఆ పాటను వేటూరి గారు రాశారు. తన మొదటి సినిమాకే అంతటి దిగ్గజాలతో వర్క్‌ చేసే అవకాశం రావడం అదృష్టం. ఆ సమయంలో పాటలో ఒక్క పదం అభ్యంతరకంగా అనిపించింది. ఆ విషయాన్ని వేటూరి గారితో ఎలా చెప్పాలా అని నేను భయపడుతున్నాను. ఆ సమయంలో బాలు గారు కల్పించుకుని ఫోన్‌ లో మాట్లాడి ఆ పదంను మార్పించారు. అలా నాకు ఆ సమయంలో బాలు గారు సహాయపడ్డారని హరీష్‌ శంకర్‌ అన్నాడు.

కొత్త కుర్రాడి సినిమాకు పాడటమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక ప్రముఖ రచయిత రాసిన పాటను మార్చమని కొత్త దర్శకుడి కోసం వకాల్తా పుచ్చుకోవడం ఆయన గొప్పతనంకు నిదర్శణం. అందుకే ఆయన  అంతటి గొప్ప వ్యక్తిగా అభిమానుల హృదయాల్లో నిలిచి పోయారు. ఎంతో మంది కొత్త వారితో వర్క్‌ చేసిన ఆయన వారికి తగ్గట్లుగా మెలిగే వారు. ప్రతి ఒక్కరు ఆయనతో తమ సినిమాలో పాడించుకోవడం గౌరవంగా భావించేవారు.
Tags:    

Similar News