భగత్ సింగ్ దర్శకుడికి ఎదురు చూపులు తప్పవా..?

Update: 2021-11-12 01:47 GMT
పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ''భవదీయుడు భగత్ సింగ్'' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న #PSPK28 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఆ మధ్య నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ‘హరి హర వీరమల్లు’ చిత్ర షూటింగ్ తిరిగి సెట్స్ మీదకు వెళ్తోందని.. ఈ క్రమంలో పవన్ - హరీష్ సినిమా మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు. ఇది చెప్పి కూడా రెండు నెలలు దాటిపోయింది. అయినా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కాలేదు.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా మొదలవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. దీనికి కారణం పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల షూటింగ్ లు పూర్తవ్వక పోవడమే అని అంటున్నారు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' లో పవన్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కొన్ని పోర్షన్స్ రీషూట్ చేస్తున్నారని.. అందుకే లేట్ అవుతుందనే టాక్ కూడా వచ్చింది.

సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తామని చెబుతూ వస్తున్నారు కానీ.. RRR రాకతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హిస్టారికల్ మూవీ 'హరి హర వీరమల్లు' షూటింగ్ ఇప్పటికి యాభై శాతం మాత్రమే జరిగింది. మిగతా సగం పూర్తవ్వడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో వచ్చే దసరా కు అయినా భగత్ సింగ్ సినిమా రెడీ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దర్శకుడు హరీష్ శంకర్ 14 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకు 7 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. 'గబ్బర్ సింగ్' సక్సెస్ తర్వాత వెంటనే తదుపరి ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన హరీష్.. 'రామయ్య వస్తావయ్యా' ప్లాప్ తో స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు. సినిమా సినిమాకు కనీసం రెండేళ్ల గ్యాప్ తీసుకుంటూ వచ్చారు. 2019 లో 'గద్దలకొండ గణేష్' సినిమా తరువాత పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నారు. గతేడాది హీరో బర్త్ డే కి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.. ఈ ఏడాది ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఇచ్చారు.

ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయింది కానీ.. ఇంకా సినిమా మొదలు కాలేదు. హరీష్ మాత్రం మరో సినిమా చేయకుండా పవన్ కళ్యాణ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే గబ్బర్ సింగ్ డైరెక్టర్ కు ఇంకొన్నాళ్లు ఎదురు చూపులు తప్పవేమో అనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వస్తున్నాయి. మరి హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో వేరే ప్రాజెక్ట్ చేస్తారా లేదా పవన్ స్క్రిప్ట్ కే మరిన్ని మెరుగులు దిద్దుతారో చూడాలి.

కాగా, 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తారు. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటారు.
Tags:    

Similar News