పూరీ పెన్ పవర్ తగ్గిందా..?

Update: 2022-08-30 03:40 GMT
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ప్రత్యేక స్థానం ఉంది. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జగన్.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకున్నాడు. ఎందరో హీరోలని పెద్ద స్టార్లని చేసాడు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఉన్న పూరీ.. ఇటీవల కాలంలో ఆయన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

పూరీ ప్రధాన బలం రైటింగ్. తెర మీద హీరో పాత్రని ఆవిష్కరించే విధానం.. హీరోతో పలికించే డైలాగ్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేయడంలో.. హీరోయిజం చూపించడంలో అతనికి సాటి లేరు. అందుకే రిజల్ట్ ని పట్టించుకోకుండా, ప్రతీ హీరో కూడా ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటాడు. అయితే ఇప్పుడు 'లైగర్' ప్లాప్ తో పూరీ పెన్ పవర్ తగ్గిందనే కామెంట్స్ వస్తున్నాయి.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "లైగర్". మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఒక అతి సాధారణమైన ప్రేమ కథను తీసుకొని.. ఎంఎంఏ బ్యాక్ డ్రాప్ ని జోడించి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

పూరీ గత చిత్రాల్లో మాదిరిగా 'లైగర్' లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. ఒక్క కొత్త సీన్ కూడా లేదు. హీరో పాత్రకు నత్తి అనే లోపాన్ని పెట్టి తన ప్రధాన బలమైన డైలాగ్స్ కు ప్రాధాన్యత లేకుండా చేసుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే తన చేతులను తానే కట్టేసుకున్నాడు. మిగతా అంశాలు కూడా దర్శకుడి స్థాయిలో లేవనే చెప్పాలి. ఒకానొక దశలో అసలు ఇది పూరీ సినిమాయేనా సందేహం కలగమానదు.

నిజానికి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాధ్.. "లైగర్" తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతాడని అందరూ భావించారు. కానీ సాలా క్రాస్ బ్రీడ్ రిజల్ట్ పూర్తి భిన్నంగా వచ్చింది. బాలీవుడ్ మోజులో రొటీన్ కంటెంట్ ను నమ్ముకుని అదనపు హంగుల మీద దృష్టి పెట్టడంతో ఇలాంటి అనుభవం ఎదుర్కోవలసి వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇక పూరీ పని అయిపోయిందిరా అనుకున్న ప్రతీసారి.. గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అవడం ఆయనకు అలవాటే. తదుపరి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని తానేంటో మరోసారి నిరూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

'లైగర్' మూవీ రిలీజ్ అవ్వకముందే పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా విజయ్ దేవరకొండ తోనే చేయనున్నట్లు ప్రకటించారు. 'JGM' అనే టైటిల్ తో సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో రూపొందనుంది. ఈ సినిమా దర్శకుడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వచ్చే ఏడాది వరకూ వేచి చూద్దాం.
Tags:    

Similar News