ఇండస్ట్రీలో ఐక్యత లేకపోవడమే సమస్యగా మారిందా..?

Update: 2022-01-06 12:25 GMT
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల అంశం మీద ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణాలో ధరలు పెంచుతూ సర్కారు జీవో ఇచ్చింది. దీంతో ఓవైపు సినీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోందని కొనియాడుతున్న సినీ ప్రముఖులు.. మరోవైపు టికెట్ రేట్లు తగ్గింపు వల్ల నష్టాలు తప్పవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లను నియంత్రిస్తూ గతేడాది ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో దీనిపై ఎక్కువగా చర్చ జరగలేదు. కానీ ఈ మధ్య వరుసగా సినిమాలు థియేటర్లల్లోకి వస్తుండటంతో అసలు సమస్య బయటకు వచ్చింది. పాండమిక్ వల్ల గత రెండేళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూసిన చిత్ర పరిశ్రమ.. తక్కువ టికెట్ ధరలతో మరింత ఇబ్బంది పడుతోందని సినీ ప్రముఖులు అంటున్నారు.

ఈ క్రమంలో టికెట్ రేట్ల విషయమై ఏపీ ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఇంతవరకు టాలీవుడ్ సీనియర్ హీరోలెవరూ ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు. పలు వేదికల మీద తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు కానీ.. ఎవరూ ముందుండి ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూడలేదు.

టాలీవుడ్ కు చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ లను నాలుగు పిల్లర్లుగా సినీ అభిమానులు పిలుచుకుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీకి సమస్య వచ్చినప్పుడు వీరే బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. మిగతా సీనియర్ యాక్టర్స్ మరియు యువ నటులను - ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ - డిస్ట్రిబ్యూటర్స్‌ - ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ తో చర్చించి ఏపీ ప్రభుత్వానికి అర్థమయ్యేలా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఐక్యత లేకపోవడం వల్లనే ఇది జరగడం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో సినిమా టికెట్ రేట్ల మీద చిరు ట్విట్టర్ ద్వారా ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అలానే ఇండీస్ట్రీ పెద్దగా వ్యవహరించనని చెప్పిన చిరంజీవి.. బాధ్యత గల ఒక ఇండస్ట్రీ బిడ్డగా అందరికి అందుబాటులో ఉంటానని.. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తానని ప్రకటించారు. తనకు మద్దతుగా నిలిస్తే ముందు నడవడానికి తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పారు.

మరోవైపు మరో సీనియర్ హీరో నాగార్జున మాత్రం సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడను అంటూ టికెట్ ఇష్యూపై స్పందించడానికి ఇష్టపడలేదు. దేని మీదైనా తన అభిప్రాయం చెప్పడం చెప్పకపోవడం నాగ్ ఇష్టం అయ్యుండొచ్చు. ప్రస్తుత రేట్ల వల్ల తన సినిమాకు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ మిగతా సినిమాలను కూడా దృష్టిలో ఉంచుకొని దీనిపై స్పందించి ఉంటే బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ వ్యవహారాల్లో తనని కలుపుకొని పోలేదని అంటుండే బాలయ్య కూడా దీనిపై అదే విధంగా స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో తన సినిమాని విడుదల చేయడం గురించి మాట్లాడుతూ.. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దామని బాలకృష్ణ అన్నారు. ఇక సోదరుడు సురేష్ బాబు టికెట్ ధరల మీద మాట్లాడుతుంటే.. వెంకటేష్ దీనిపై ఎప్పటిలాగే మౌనంగా ఉంటున్నారు. టికెట్ రేట్లు తక్కువ ఉన్నాయంటూ ఓటీటీలలో తన సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు.

మరో సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదని.. కొన్ని వేలమంది ఆశలు - కొన్ని వేల కుటుంబాలు - కొన్ని వేల జీవితాలని లేఖ రాశారు. చిత్ర పరిశ్రమలోని వారందరూ కూర్చొని సమస్యలపై మాట్లాడుకోవాలని.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదని అన్నారు. అందరం కలిసి ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుందని.. కలిసి ఇండస్ట్రీలోని సమస్యలను పరిష్కరించుకుందామని మోహన్ బాబు పిలుపునిచ్చారు.

ఇలా సినీ పెద్దలందరూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను ఆలోచనలను చెబుతూ వస్తున్నారు కానీ.. సమస్యను తమ భుజాల మీద మోయడానికి ముందుకు ఎవరూ రాలేదు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని.. ఇండస్ట్రీ సమస్యగా భావించి అందరూ ఏకతాటిపై నడవాలని సినీ అభిమానులు సూచిస్తున్నారు. కరోనా సమయంలో ఇండస్ట్రీని ఆదుకోవడానికి ఎలా ముందుకు వచ్చారో.. ఇప్పుడు కూడా అందరూ కలిసి ప్రాబ్లమ్స్ ని ఎట్టి చూపాలని కోరుతున్నారు. యూనిటీగా ఉన్నప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News