న‌డిచొచ్చే ఫ్యాన్స్ ఆయ‌నకూ ఉన్నారు!

Update: 2021-08-19 13:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల‌పై అభిమానులు చూపించే ప్రేమ అప‌రిమిత‌మైన‌ది. హీరోల కోసం ఎంత‌గైనా తెగిస్తారు. వంద‌ల కిలొమీట‌ర్లు న‌డిచొచ్చి హీరోల్ని చూసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. నాటిమేటి వెట‌ర‌న్ హీరోల కోసం అడ‌వులు దాటుకుని వ‌చ్చి అభిమానులు క‌లుసుకునేవారు. నేటిత‌రంలో అసాధార‌ణ స్టార్ డ‌మ్ తో వెలిగిపోతున్న అగ్ర క‌థానాయ‌కుల కోసం అభిమానులు త‌మ‌ జీవితాల్నే త్యాగం చేసిన సంద‌ర్భాలు కోక‌ల్ల‌లు. వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుచుకుంటూ వ‌చ్చి ఫోటోలు దిగిన వాళ్ల‌ను చూశాం. అందుకే హీరోలు కూడా అభిమానుల త్యాగాల‌ను కోరుకోవ‌డం లేదు. హుందాగా ఉండాల‌ని కోరుతున్నారు.

స్టార్ హీరోల‌కేనా ఇలాంటి డై హార్ట్ ఫ్యాన్స్ ఉండేది! మాకు ఉండ‌రా? అని నిరూపించారు  విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్. న‌టుడిగా  కొన‌సాగుతూనే త‌న‌దైన శైలిలో దేశ ప్ర‌ధాని మోదీ విధి విధానాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతూ త‌న‌దైన శైలి రాజ‌కీయ స్పీచ్ ల‌తో నూ విల‌క్ష‌ణ నటుడు దూసుకుపోతున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న భ‌విష్య‌త్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ! ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌త్య‌ర్ధి ప్యాన‌ల్ స‌భ్యులు లోక‌ల్ .. నాన్ లోక‌ల్ ఫీలింగ్ తెర‌పైకి తీసుకొచ్చి ఎలాగైనా ప్ర‌కాష్ రాజ్ ని బ‌రి నుంచి త‌ప్పించ‌డ‌మా!  లేక గెల‌వ‌కుండా చేయ‌డ‌మా? అన్న దానిపై కుయుక్తులు ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిన‌దే.

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ అభిమాని.. జూనియ‌ర్ ఆర్టిస్ట్  ఒక‌రు ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని  ఏకంగా అత‌ని కోసం రాజ‌మండ్రి నుంచి హైద‌రాబాద్ కి న‌డ‌క ప్రారంభించారు. రాజ‌మండ్రి రూర‌ల్ కొల‌మూరు నుంచి రంజిత్ కుమార్ 485 కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి న‌డ‌క మార్గం ఎంచుకుని న‌డ‌క ప్రారంభించారు. ఇంత‌లో విష‌యం ప్ర‌కాష్ రాజ్ కి తెలియ‌డంతో వెంట‌నే ఆయ‌నను  తిరిగి ఇంటికి వెళ్లిపోమ‌ని.. ఇంత అభిమానం చూపంచినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ``రంజిత్ బంగారం ..నిస్వార్ధంతో కూడిన మీలాంటి వారి అభిమాన‌మే  క‌ళాకారుడిగా ముందుకు తీసుకెళ్తుంది. మీ ప్ర‌య‌త్నం మ‌న‌సుకు బాధ క‌ల్గిస్తుంది. ద‌య‌చేసి తిరిగి ఇంటికెళ్లి క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు ప్ర‌కాష్ రాజ్ తెలిపారు.

గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ .. సూపర్ స్టార్ మ‌హేష్ .. డార్లింగ్ ప్ర‌భాస్ .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం డైహార్డ్ ఫ్యాన్స్ ఇలానే కిలోమీట‌ర్లు న‌డిచి వ‌చ్చిన సంద‌ర్భాలున్నాయి.

ఫ్యానిజంపై నాని - దేవ‌ర క్లాస్ లు..

ఇంత‌కుముందు అదుపు త‌ప్పిన ఫ్యానిజంపై నేచుర‌ల్ స్టార్ నాని క్లాస్ తీస్కున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌కోసం త్యాగాలు చేయొద్ద‌ని కుదిరితే తాను ఫ్యాన్స్ కోసం త్యాగాలు చేస్తాన‌ని ఒక ర‌కంగా నాని క్లాస్ తీస్కున్నారు. అలాగే త‌న కాళ్ల‌పై ప‌డ‌బోయిన ఫ్యాన్స్ ని వారిస్తూ దేవ‌ర‌కొండ కూడా ఓ వేదిక‌పై అభిమానికి క్లాస్ తీస్కున్నారు. ఇలాంటివి స‌రికాద‌ని స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అభిమానం హ‌ద్దు మీరితే ఎలా ఉంటుందో మ‌న స్టార్ హీరోల ఫ్యాన్స్ ని చూడాలి. త‌మ ఫేవ‌రెట్ స్టార్ కోసం ప‌డిగాపులు ప‌డ‌డంలో సెల్ఫీలు ఫోటోలు అంటూ ర‌భస చేయ‌డంలో ఎక్క‌డా త‌గ్గ‌రు. యూత్ ఎంతో ఎగ్జ‌యిట్ అయిపోయి మీదికి ఉరుకుతారు. అదంతా ఒక కోణం అనుకుంటే సోష‌ల్ మీడియాల్లో త‌మ ఫేవ‌రెట్ కోసం అభిమాన సంఘాలు కుప్ప‌లు గా పోగై ఘ‌ర్ష‌ణ ప‌డ‌డం చూస్తున్న‌దే. నేటి మోడ్ర‌న్ వ‌ర‌ల్డ్ లో చాలా మారుతున్నా.. ఫ్యానిజం తీరుతెన్నులు మాత్రం మార‌డం లేదు.
Tags:    

Similar News