‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’ ట్రైలర్: ముగ్గురు అమ్మాయిల భావోద్వేగాలతో ముడిపడిన కథ

Update: 2021-10-16 14:49 GMT
సునీల్‌ - సుహాష్ - చాందిని రావు - దివ్య శ్రీపాద - శ్రీ విద్య మహర్షిని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ మూవీ ''హెడ్స్‌ అండ్‌ టేల్స్‌''. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ దీనికి కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'కలర్ ఫోటో' కోర్ టీమ్ కలిసి వర్క్ చేసిన ఈ ఒరిజినల్.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5’ లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

జ్యోతిష్యుడైన సునీల్ 'అందరి కథలు ఒకే విధములు.. కథనం మారి గతే బ్రతుకులు' అని ముగ్గురు మహిళల సంక్లిష్ట జీవితాన్ని వివరించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో శ్రీ విద్యా ఒక అప్ కమింగ్ యాక్ట్రెస్ గా కనిపిస్తోంది. ఆమెకు ఓ వెబ్ సిరీస్‌ లో నటించే అవకాశం దక్కగా.. బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇక భర్త వేధింపులకు గురయ్యే పోలీస్ కానిస్టేబుల్ గా దివ్య దృష్టి కనిపించింది. చివరగా ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న అమ్మాయిగా చాందిని రావు ని చూపించారు.

తమ భాగస్వాములను అమితంగా ఇష్టపడే ముగ్గురు మహిళలు.. వారి నుంచి అలాంటి ప్రేమను పొందడం లేదని గ్రహించి.. తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ముగ్గురూ కలిసి ఒక్క రాత్రిలో ఎలా పరిష్కరించుకున్నారనేది ''హెడ్స్‌ అండ్‌ టేల్స్‌'' కథ అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఈ సిరీస్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం సమకూర్చడం విశేషం. వెంకట్ ఆర్. శాఖమురి సినిమాటోగ్రఫీ అందించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

SKN సమర్పిస్తున్న ఈ సిరీస్ ని రమ్య క్రియేషన్స్ - పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్స్ మీద రూపొందించారు. ప్రదీప్ - రమ్య చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు. ‘హెడ్స్ & టేల్స్’ మూవీ ప్రతి మహిళకూ స్ఫూర్తినిస్తుందని.. తమ కోసం తమ హక్కుల కోసం పోరాడాలని సూచిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 22న రాబోతున్న ఈ ఒరిజినల్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.




Full View





Tags:    

Similar News